ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Corona Symptoms : తెలంగాణలో 4 లక్షల మందిలో కరోనా లక్షణాలు గుర్తింపు

By

Published : Jan 31, 2022, 9:52 AM IST

Corona Symptoms : తెలంగాణలో 4 లక్షలకుపైగా మందిలో కరోనా లక్షణాలున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జ్వర సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఇంత మందిలో కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించామని పేర్కొంది. వారందరిలో వైరస్ నిర్ధారణ కాకపోయినా.. ఔషధ కిట్లు అందజేసినట్లు చెప్పింది. 11 జిల్లాల్లో రెండో విడత సర్వేను షురూ చేసినట్లు వివరించింది.

Corona Symptom
Corona Symptom

Corona Symptoms : తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇంటింటా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. జ్వర సర్వేలో, ప్రభుత్వాసుపత్రుల్లోని ఓపీ సేవల్లో ఈ విషయం స్పష్టమైంది. కేవలం 9 రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283 మందిలో కొవిడ్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు. మొత్తం 90లక్షల పైచిలుకు ఇళ్లలోనూ, ఆసుపత్రి ఓపీల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగా పై విషయం నిర్ధారణ అయింది. వైరస్‌ నిర్ధారణ కాకపోయినా.. 3,97,898 మందికి ఔషధ కిట్లు అందజేశారు. ఈ నెల 21 నుంచి 29 వరకూ జ్వర సర్వే, కొవిడ్‌ ఓపీ సేవల్లో భాగంగా కిట్లను పంపిణీ చేశారు. శనివారం(29)తో తొలివిడత సర్వే పూర్తయ్యింది. రెండో విడత సర్వే జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, నిర్మల్‌, వనపర్తి, నిజామాబాద్‌, భద్రాద్రి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో మొదలైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

Corona Cases in Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 1,170 ఓపీ కేంద్రాలను నిర్వహించగా.. 6,58,879 మందిలో జలుబు, జ్వరం తదితర సమస్యలు బయటపడ్డాయి. వీరిలో 94,910 మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్లు వైద్యసిబ్బంది గుర్తించారు. వారికి కొవిడ్‌ ఔషధ కిట్లు అందజేశారు. ఓపీ సేవల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,70,962 మంది వైద్యులను సంప్రదించారు. ఇక్కడ 18,758 ఔషధ కిట్లను పంపిణీ చేశారు. ఆతర్వాత భద్రాద్రి కొత్తగూడెం (9,170), మేడ్చల్‌ మల్కాజిగిరి (8,278), ఖమ్మం (5,346), నల్గొండ (4,374), రంగారెడ్డి (3,856), సంగారెడ్డి (3,138), కరీంనగర్‌ (3,123), మంచిర్యాల (3,093), పెద్దపల్లి (2,897), నిజామాబాద్‌ (2,833), నాగర్‌కర్నూల్‌ (2,804), యాదాద్రి భువనగిరి (2,503), సిద్దిపేట (2,135) జిల్లాల్లో అత్యధిక ఔషధ కిట్లను పంపిణీ చేశారు. అతి తక్కువగా మహబూబాబాద్‌ జిల్లాలో 185మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు.

హనుమకొండలో అత్యధికులు

Telangana Corona Cases Today : రాష్ట్రవ్యాప్తంగా 16,258 వైద్య బృందాలు 9 రోజుల్లోనే 90,54,725 ఇళ్లలో జ్వర సర్వే చేశారు. ఇందులో 3,05,373 మందికి లక్షణాలున్నట్లు గుర్తించి కొవిడ్‌ మందుల కిట్లు అందించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 5,45,300 ఇళ్లలో జ్వర సర్వే చేశారు. హనుమకొండ జిల్లాలో ఎక్కువమంది కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అక్కడ అత్యధిక కిట్లు (22,914) పంపిణీ చేశారు. తర్వాత వరుసలో భద్రాద్రి కొత్తగూడెం (20,223), హైదరాబాద్‌ (17,147), సంగారెడ్డి (15,945), నల్గొండ (15,673), మేడ్చల్‌ మల్కాజిగిరి (15,482), ఖమ్మం (14,646), మెదక్‌ (14,522), మంచిర్యాల (11,876), వరంగల్‌ (10,825), రంగారెడ్డి (10,739) జిల్లాలున్నాయి.

నిరంతరాయంగా వైద్య సర్వేతో మేలు

Telangana Corona Updates : ఇంటింటి జ్వర సర్వే ద్వారా సత్ఫలితాలు వస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. లక్షణాలు కనిపించిన వెంటనే మందుల కిట్లు ఇవ్వడం వల్ల అత్యధికుల్లో ఆరోగ్యం కుదుటపడుతోంది. ప్రజల్లోనూ అప్రమత్తత పెరిగింది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స పొందుతున్నారు. ఫలితంగా శ్వాసకోశాల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌, నిమోనియా వంటి సమస్యలు లేవని వైద్యులు చెబుతున్నారు. గతంలో సీజనల్‌గా చేరే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కేసుల సంఖ్యతో పోల్చితే.. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అలాంటి రోగుల చేరికలు బాగా తగ్గాయని వైద్యవర్గాలు విశ్లేషించాయి. కొవిడ్‌ సమయంలో మాత్రమే కాకుండా నిరంతరాయంగా ఇటువంటి సర్వేలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ‘ఇంటింటి జ్వర సర్వే విజయవంతమైంది. మలేరియా, డెంగీ తదితర జ్వరాలకు కూడా ఇలాగే సర్వే నిర్వహించి అవసరమైన మందులివ్వాలి’ అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details