ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి రైతుల పాదయాత్ర.. 18వ రోజు @ 15 కి.మీ

By

Published : Sep 29, 2022, 9:26 PM IST

FARMERS PADAYATRA : రాజధాని లేకుండా మిగిలిపోయిన రాష్ట్రం కోసం ఆలోచించారు.. పిల్లలకు ఇవ్వాల్సిన భూములను రాష్ట్ర భవిత కోసం ఇచ్చేశారు. అలాంటి వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండాలంటూ ముందుకొచ్చారు. రైతులతో కలిసి గొంతు కలిపారు. వారి అడుగులో అడుగేసి మద్దతు తెలిపారు. ఇలా.. ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. దెందులూరు మండలం శ్రీరామవరంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తినా..కవ్వింపు చర్యలకు బెదిరేది లేదంటూ రైతులు ముందుకు కదిలారు.

AMARAVATI FARMERS PADAYATRA
AMARAVATI FARMERS PADAYATRA

ఏలూరు జిల్లాలో రైతుల పాదయాత్రకు బ్రహ్మరథం

AMARAVATI FARMERS PADAYATRA : అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు.. ఏలూరు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికక్కడ పూలవర్షం కురిపిస్తూ.. ఆత్మీయ స్వాగతం పలికారు. 18వ రోజు దెందులూరు మండలం కొవ్వలి నుంచి యాత్ర ప్రారంభమైంది. రైతులకు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. స్థానికులు రైతులను ఆత్మీయంగా పలకరించి.. అమరావతికి మద్దతు తెలిపారు. దెందులూరు చేరుకున్న రైతుల పాదయాత్రకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.

రైతులను స్థానికులు సాదరంగా స్వాగతించారు. జాతీయ రహదారిపై వంతెన నుంచి ఊళ్లోకి చేరే వరకు పాదయాత్రికులపై పూలవర్షం కురిపించారు. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం సరికాదని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దెందులూరు ప్రజలు తేల్చి చెప్పారు.

దెందులూరు, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, రైతులు, రైతు కూలీలు.. తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కొందరు ప్రత్యేకంగా బస్సులో వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. దెందులూరు మండలం శ్రీరామవరంలో రైతు జెండాలతో అమరావతి రైతులను గ్రామస్థులు ఆహ్వానించారు.

పాదయాత్ర వైకాపా మండల కన్వీనర్‌ కామిరెడ్డి నాని నివాసం వద్దకు చేరగానే గందరగోళం తలెత్తింది. వైకాపా కార్యకర్తలు కొందరు రైతులకు ఆ పార్టీ జెండాలు చూపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని.. ఉద్రిక్తతలు పెరగకుండా సద్దుమణిగేలా చేశారు. వైకాపా కవ్వింపు చర్యలు మానుకోవాలని అమరావతి రైతులు, ఐకాస నేతలు హితవు పలికారు. శ్రీరామవరం మీదుగా పెరుగుగూడెం వరకు పాదయాత్ర సాగింది. 18వరోజు దాదాపు 15 కిలో మీటర్ల మేర రైతులు కదంతొక్కారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details