ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kris city: క్రిస్‌ సిటీ పనులకు గుత్తేదార్ల నిరాసక్తి

By

Published : Jul 25, 2022, 11:19 AM IST

Kris city: క్రిస్‌ సిటీ పనులు చేపట్టడానికి ఒక్క గుత్తేదారు సంస్థా ముందుకు రావడం లేదు. రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన పనులను దక్కించుకోవడానికి గుత్తేదార్లు పోటీ పడాల్సింది పోయి.. బిడ్లు దాఖలు చేయడానికి ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

Disinterest of monopolists for KRIS City works
క్రిస్‌ సిటీ పనులకు గుత్తేదార్ల నిరాసక్తి

Kris city: కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (క్రిస్‌ సిటీ) పనులు చేపట్టడానికి ఒక్క గుత్తేదారు సంస్థా ముందుకు రావడం లేదు. రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన పనులను దక్కించుకోవడానికి గుత్తేదార్లు పోటీ పడాల్సింది పోయి.. బిడ్లు దాఖలు చేయడానికి ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పదేపదే గడువులు పెంచినా గుత్తేదారు సంస్థను వెతికి పట్టుకోవడం అధికారులకు తలకు మించిన పనవుతోంది.

చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవా (సీబీఐసీ) ప్రాజెక్టులో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర క్రిస్‌ సిటీ అభివృద్ధికి రూ.1,054.63 కోట్లతో ఈపీసీ విధానంలో పనులను ప్రతిపాదించారు. ఇందులో భాగంగా రోడ్లు, భూముల చదును, డ్రెయిన్లు, వంతెనలు, అగ్నిమాపక వ్యవస్థ, రీసైక్లింగ్‌ వాటర్‌ సప్లై నెట్‌వర్క్‌, నీటి శుద్ధి ప్లాంటు, మురుగునీటి శుద్ధి ప్లాంటు, కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ సహా తాగునీటి సరఫరా నెట్‌వర్క్‌ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పనులను ప్రతిపాదిస్తూ గత నెల 15న రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) టెండరు ప్రకటన జారీ చేసింది.

గుత్తేదారు సంస్థ ఈ పనులను 36 నెలల్లో పూర్తి చేసి, నాలుగేళ్లపాటు వాటిని నిర్వహించాలి. బిడ్‌ దాఖలుకు నిర్దేశించిన గడువు ఈ నెల 20తో ముగిసింది. ఒక్క సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేయకపోవడంతో ఆగస్టు 8 వరకు గడువు పొడిగించక తప్పలేదు. క్రిస్‌ సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,190 కోట్లతో ప్రతిపాదించిన పనులకు 2021 సెప్టెంబరులో ఏపీఐఐసీ టెండరు ప్రకటన జారీ చేసింది.

అప్పట్లోనూ గుత్తేదార్ల నుంచి స్పందన రాకపోవడంతో ఒకసారి గడువు పొడిగించింది. తర్వాత గుత్తేదార్లతో సంప్రదింపులు జరిపినా పరిస్థితిలో మార్పు లేక టెండరు ప్రకటనను రద్దు చేసింది. గుత్తేదారు సంస్థల సూచనల ఆధారంగా రూ.1,054.63 కోట్లకు సవరించిన ప్రతిపాదనల ప్రకారం మళ్లీ టెండర్లు పిలిచినా అదే పరిస్థితి.


ఇవీ చూడండి:అంతర్రాష్ట్ర హంతక ముఠా అరెస్టు.. తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లు

ABOUT THE AUTHOR

...view details