ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crop Loss: వర్షపు నీటిలో పంటలు.. రైతన్న కంట్లో కన్నీరు

By

Published : Oct 19, 2022, 8:21 AM IST

Updated : Oct 19, 2022, 9:51 AM IST

Crop Loss: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు.. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళనలో కురుకుపోతున్నారు. వర్షం ప్రభావం నుంచి బయటపడ్డ పంటలకు తెగుళ్లు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Crop Loss
వర్షాలతో భారీగా పంట నష్టం

Crop Loss: కృష్ణానది పరివాహక ప్రాంతాల రైతుల పరిస్థితి గోరు చుట్టు మీద రోకలి పోటు అన్న చందంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచి... రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు నదికి భారీగా వరద నీరు రావటం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు వదులుతున్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లోని పొలాలు నీట మునుగుతున్నాయి.

"ఈ ఏడాది పంటలు అశాజనకంగా ఉన్నాయని ఆనందించేలోపే వర్షం... సంతోషాన్ని నీటిపాలు చేసింది. ఎకరాకు పెట్టుబడిగా సూమారు లక్ష 50 వేల వరకు పెట్టాం. వర్షాల ప్రభావంతో పంట నష్టం ఎక్కువగా జరిగింది. వర్షాల వల్ల ఎకరాకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు నష్టం వాటిల్లింది."-వెంకటేశ్వరరావు, రైతు

అప్పులు చేసి పొలం సాగు చేస్తున్నామని, వర్షం వల్ల ఇప్పుడు పంట చేతికి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఒకవైపు పంటను ముంచెత్తిన వర్షపు నీరు... మరోక వైపు పంటను పీడిస్తున్న తెగుళ్లతో పంటను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పంట వర్షపు నీళ్లలో ఉండటంతో పంటను తాటాకు, మైలు, నత్త, లంబాడీ తెగుళ్లు పట్టి పీడిస్తున్నాయని అవేదన చెందుతున్నారు. తెగులు నుంచి పంటను రక్షించుకునేందుకు మందులను పిచకారీ చేస్తున్నారు. ఇప్పటికే పంట సాగు కోసం చాలా ఖర్చు చేశామని... ఇప్పుడు మళ్లీ మందులు కొనుగోలు చేయాలంటే ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు.

వర్షాలతో భారీగా పంట నష్టం

పంటలు దెబ్బతినడంతో రైతన్నలు సతమతమవుతున్నారు. వర్షాలు తమను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వాపోతున్నారు. కంద, పసుపు, చెరుకు పంటలు ఇప్పుడే వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. వర్షపు నీరు పంట పొలాల్లో నిలిచిపోవడంతో కంద పిలకలు, చెరకు గడలు, పసుపు దుంపలు భూమిలోనే కుచించుకపోయి పంట దిగుబడి తగ్గుతుందని రైతులు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకుని సాగు చేస్తుంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రైతులు నిండ మునిగిపోతున్నారు. ఈదరు గాలులకు కంద, చెరకు, అరటి తోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. వర్షపు నీటిని పొలాల నుంచి బయటకు పంపేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 19, 2022, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details