ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CORONA AND DENGUE EFFECT: ఒకే లక్షణాలతో రెండు రకాల జ్వరాలు

By

Published : Oct 8, 2021, 11:34 AM IST

ప్రజలను కరోనా, డెంగీలు తీవ్రంగా వణికిస్తున్నాయి. రెండు జ్వరాలకు ఒకే రకమైన లక్షణాలు ఉండటంతో... ఎచ్చింది కరోనానా లేక డెంగీయో తెలీక నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటి నిర్ధరణ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

corona-and-dengue-fevers-with-similar-symptoms-in-ap
ఒకే లక్షణాలతో రెండు రకాల జ్వరాలు

ప్రజలను ఒకవైపు కొవిడ్‌, మరోవైపు డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. రెండింటి లక్షణాలు ఒకేలా ఉండటంతో... వచ్చింది ఏదో తెలియక బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో వీటి నిర్ధారణకు ఎక్కువ సమయం పడుతోందని ప్రైవేటు ల్యాబులను ఆశ్రయిస్తూ రూ.2-3 వేలు వెచ్చిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా డెంగీ కేసులు 2,528 నమోదయ్యాయి. కిందటేడాది ఇదే సమయానికి 964 మాత్రమే వచ్చాయి. ఈ కేసులు పట్టణాలు/నగరాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి.

వైద్యం అంతంత మాత్రమే

పట్టణారోగ్య కేంద్రాలలో కొన్నిచోట్ల వైద్య సిబ్బంది, మందుల కొరత నెలకొంది. ప్రతి జిల్లాలో కిందటేడాది కంటే ఈసారి డెంగీ నిర్ధారణ కేంద్రాలను పెంచినా ఫలితాల వెల్లడిలో ఆలస్యమవుతోంది. పలుచోట్ల ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. కొవిడ్‌కు ఆర్టీపీసీఆర్‌ ఫలితం రావాలంటే 48 గంటల వరకు పడుతోంది. డెంగీ నిర్ధారణకు చేసే ‘ఎలీసా’ పరీక్ష ఫలితం 3-5 రోజుల తర్వాత అందుతోంది. కొవిడ్‌, డెంగీ లక్షణాల్లో ప్రధానంగా ఆయాసం, దగ్గు, జ్వరం ఉంటున్నాయి. దాంతో పలువురికి రెండు పరీక్షలనూ చేయాల్సి వస్తోంది. లక్షణాల తీవ్రతను బట్టి కొందరికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే... ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం డెంగీకి ‘ఎలీసా’ ఫలితమే ప్రామాణికమని అధికారులు చెబుతున్నారు.

మలేరియా.. టైఫాయిడ్‌ సైతం!

ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మలేరియా కేసులు 1,169 నమోదయ్యాయి. కిందటేడాది ఇదే సమయానికి నమోదైన కేసులు 1,812. అక్యూట్‌ డయేరియా కేసులు ఈ ఏడాది ఇప్పటివరకు 1,92,668 నమోదయ్యాయి. ఈ ఏడాది 38వ వారం వరకు 8,715 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి.

ఇదీ చూడండి:PYTHON HULCHAL: రాత్రంతా చుక్కలు చూపించిన కొండచిలువ..

ABOUT THE AUTHOR

...view details