ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్బీకేల ద్వారా కల్లాల వద్దే ధాన్యం సేకరణ: సీఎం జగన్

By

Published : May 7, 2021, 5:43 PM IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా కల్లాల వద్దనే ధాన్యాన్ని సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏ ఊరి పంట ఏ మిల్లర్‌ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదన్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. రేషన్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.

ration door delivery
cm jagan review on ration door delivery

ఆర్బీకేల ద్వారా కల్లాల వద్దనే ధాన్యం సేకరణ, రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీపై సీఎం జగన్‌ సమీక్షించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ఊరి పంట ఏ మిల్లర్‌ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలన్నారు. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం ఆర్బీకేల వద్ద మీటర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్‌ వద్దకు పంపించవద్దని స్పష్టం చేశారు.

అందుకోసం జిల్లాను యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలని సీఎం నిర్దేశించారు. కొనుగోలు చేస్తామని చెప్పిన సమయానికి కొనుగోలు చేయాలని, మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉందని సీఎం స్పష్టం చేశారు. రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలని, అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను తనదిగా భావించాలన్నారు.

కమిటీలకు అవగాహన కల్పించండి...

రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయశాఖ చూడాలని.. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని సీఎం సూచించారు. ఈ-క్రాపింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకూ రెండూ కలిసి పని చేయాలన్నారు. వ్యవసాయ సలహా కమిటీలను క్రియాశీలకం చేయాలన్న ముఖ్యమంత్రి.. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలని సూచించారు. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం ఉండాలన్నారు. ఆ కమిటీల బాధ్యతలు వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షించాలన్నారు.

ఆదాయం తగ్గొద్దు..

ఏ విత్తనం వేస్తే బాగుంటుంది.. ? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు కమిటీలు ముందే చెప్పాలని సీఎం సూచించారు. అలాగే.. రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని చెప్పాలన్నారు. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదని చెప్పారు.

ఏ లోపం రావొద్దు..

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ పై చర్చించిన సీఎం.. ఇంటింటికీ సరకుల చేరవేతలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్‌ కాకుండా చూడాలన్నారు. ఆ మేరకు మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ .. ఎండీయూలు పని చేయాలన్నారు. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలన్నారు. అవసరమైన తూకం యంత్రాలు కొనుగోలు చేయాలన్నారు. బియ్యం నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడొద్దన్నారు. ఎవరైనా ఇంటి వద్ద రేషన్‌ మిస్‌ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ఈ రబీ సీజన్‌లో 45.20 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఇది గత ఏడాది కంటే 15 శాతం ఎక్కువని చెప్పారు. ఈసారి ఉత్పత్తి 65.23 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, త్వరలో ఆ సేకరణ 70 వేల మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని వివరించారు. కల్లాల వద్దనే ధాన్యం సేకరించేలా ఆర్బీకేల స్థాయిలో అవసరమైన అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

త్వరలోనే జగన్ దిల్లీ పెద్దలను కలిసే అవకాశం: ఎంపీ రఘురామ

ABOUT THE AUTHOR

...view details