ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా సాగు బోర్లకు​ మీటర్ల ఏర్పాటుకు కసరత్తు

By

Published : May 6, 2022, 6:08 PM IST

Updated : May 7, 2022, 5:03 AM IST

CM JAGAN REVIEW: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శ్రీకాకుళం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందన్న సీఎం....అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయం పంపుసెట్లకు మీటర్ల పెట్టడం అంటే రైతులకు ఉరితాళ్లు వేయడమేనంటూ మండిపడుతున్నాయి.

CM JAGAN REVIEW
వ్యవసాయశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

CM JAGAN REVIEW: రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు త్వరలోనే మీటర్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. మీటర్ల ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందడంతోపాటు సేవలు మరింత మెరుగుపడతాయని వివరించారు. ఈ విషయమై రాజకీయ లబ్ధి కోసం కొందరు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఆర్‌బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ‘వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. సుమారు 30% విద్యుత్తు ఆదా అయింది. కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయింది’ అని చెప్పారు.

రైతు భరోసా, పంటల బీమా చెల్లింపు, రాయితీపై వ్యవసాయ ఉపకరణాలు, ఖరీఫ్‌ సన్నద్ధత తదితర అంశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులను వ్యవసాయ మిషన్‌ వైస్‌ఛైర్మన్‌ నాగిరెడ్డి సీఎంకు చూపించారు. తోటబడి కార్యక్రమంలో భాగంగా మామిడి, అరటిపై రూపొందించిన కరదీపికలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. మే 11న మత్స్యకార భరోసా, 16న రైతు భరోసా, జూన్‌ 15 లోగా రైతులకు పంటల బీమా చెల్లించాలని చెప్పారు. జూన్‌ మొదటి వారంలో రైతులకు 3వేల ట్రాక్టర్లు, 402 వరికోత యంత్రాలను సామాజిక అద్దె యంత్రాల కేంద్రాలకు అందజేయనున్నట్లు వివరించారు.

పంట సాగుదారు హక్కు పత్రాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు చెప్పారు. దీని వల్ల రైతు హక్కులకు ఎలాంటి భంగం కలగదనే విషయాన్ని తెలియజేయాలని, తన తరపున లేఖను కూడా వారికి పంపాలని సూచించారు. ‘ఆర్‌బీకేల్లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ కోర్సులను విశ్వవిద్యాలయాల ద్వారా రూపొందించాలి. వారి పరిశీలన, సలహాలతో వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. నిరంతర పరిశోధనలూ ఉంటాయి’ అని తెలిపారు. ‘చిన్న, సన్నకారు రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకరణాల పంపిణీపై ప్రణాళిక రూపొందించండి. ప్రతి ఆర్‌బీకే పరిధిలో పరికరాలు అందేలా చూడాలి’ అని ఆదేశించారు.

‘కిసాన్‌ డ్రోన్ల నిర్వహణ, వినియోగంపై ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి.. వారికి శిక్షణ ఇవ్వాలి. అనంతరం ధ్రువీకరణ పత్రాలూ అందించాలి. డ్రోన్‌తో పురుగుమందులు, ఎరువులు ఎలా వేయాలో రైతులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించాలి. ఈ ఏడాదే డ్రోన్లను వినియోగించే పరిస్థితి రావాలి’ అని సూచించారు. ‘చిరు ధాన్యాలు సాగు చేసే రైతుల్ని ప్రోత్సహించాలి. ఉత్పత్తులకు అదనపు విలువ జోడించాలి. వినియోగం పెరిగేలా చూడాలి. అరకొర నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో పంటల మార్పిడిపై ప్రణాళిక రూపొందించండి’ అని సీఎం చెప్పారు. ఆర్‌బీకే నుంచి జిల్లాస్థాయి వరకు వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల నిర్వహణకు షెడ్యూలు రూపొందించుకోవాలని సూచించారు. ఎఫ్‌ఏఓ ఛాంపియన్‌ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలను నామినేట్‌ చేయడాన్ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

4% అధికంగా వ్యవసాయ ఉత్పత్తి:2020-21తో పోలిస్తే 2021-22 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తి 4% పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ‘171.7 లక్షల టన్నుల ఉత్పత్తి లభించింది. 66,803 హెక్టార్లలో మూడో పంటసాగు చేయడం రికార్డు. ఇది లక్ష హెక్టార్లు దాటే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే.. 477% పెరిగింది’ అని చెప్పారు. ‘వచ్చే ఖరీఫ్‌ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 6 లక్షల టన్నుల ఎరువుల్ని సిద్ధం చేశాం. సాగునీటిని సకాలంలో విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

భగ్గుమన్న రైతు సంఘాల నాయకులు:వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు పెడతాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాల నాయకులు భగ్గుమన్నారు. ఇది వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నమన్నారు. సీఎం ఈ విషయంలో వెనక్కి తగ్గే వరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే అవి రైతుల మెడలకు ఉరితాళ్లు వేయడమే నని సాగునీటి సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు అన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ఇలాంటి చర్యలకు పూనుకుంది అని ఆక్షేపించారు. విద్యుత్‌ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ ప్రకటించింది.

ఇదీ చదవండి: మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

Last Updated : May 7, 2022, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details