ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cbn:పీడిత ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: చంద్రబాబు

By

Published : Oct 3, 2021, 4:58 AM IST

పీడిత ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రజాయాత్ర ప్రారంభిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని.. సమర్థులైన యువత రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తమ హక్కుల సాధనకు, భావితరాల ఉజ్వల భవితకు రాజకీయాలను వేదికగా చేసుకోవాలని సూచించారు.

చంద్రబాబు
చంద్రబాబు నాయుడు తాజా వార్తలు

పీడిత ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రజాయాత్ర ప్రారంభిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యల కారణంగా.. రైతులు, రైతు కూలీలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులతోపాటు బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలి’ అని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చంద్రబాబు చేపట్టిన మీ కోసం పాదయాత్రకు తొమ్మిదేళ్లు నిండిన సందర్భంగా.. తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రాజశేఖర్‌రెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచక పాలనను ప్రజలకు తెలియజేస్తూ హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించాం. ప్రజలతో మమేకమై.. ఎన్నో సమస్యలను తెలుసుకున్నా. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడాలని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశాం. మన కష్టం, శ్రమ ఇప్పుడు వృథా అయింది’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, చంద్రదండు కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగు వృత్తినిపుణుల విభాగం అధ్యక్షురాలిగా తేజస్విని పొడపాటి

మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని.. సమర్థులైన యువత రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తమ హక్కుల సాధనకు, భావితరాల ఉజ్వల భవితకు రాజకీయాలను వేదికగా చేసుకోవాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా తెలుగు వృత్తి నిపుణుల విభాగాన్ని ఆయన ప్రారంభించారు. అధ్యక్షురాలిగా తేజస్విని పొడపాటికి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అరాచకాన్ని నిలువరించి, స్వర్ణాంధ్రగా మార్చేందుకు చంద్రబాబు నాయకత్వం అవసరమని, అందుకు వేదిక ఏర్పాటు చేయాలని పలువురు వృత్తినిపుణులు కోరడంతో ఈ విభాగాన్ని ప్రారంభించినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో తెలుగు వృత్తినిపుణుల విభాగం ప్రధాన కార్యదర్శులు గడ్డం మహేంద్ర, కనకమేడల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట నర్సింగ్ రావు

ABOUT THE AUTHOR

...view details