Chandrababu letter to DGP: తెదేపా మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. డీజీపీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు అదేశాలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని, వెంటనే నరేంద్రను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దారపనేని నరేంద్రను సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఏడుగురు వ్యక్తులు రాత్రి వేళ నేమ్ బ్యాడ్జ్‌లు కూడా లేకుండా నరేంద్ర ఫ్లాట్‌లోకి ప్రవేశించి, తాము సీఐడీ అని చెప్పి అతన్ని తీసుకువెళ్లారని లేఖలో పేర్కొన్నారు. నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మొత్తం పోలీసు శాఖ బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తెదేపా నేతలు, క్యాడర్‌ను టార్గెట్ చేయడంలో సీఐడీ పూర్తిగా నిమగ్నమైందని దుయ్యబట్టారు. సెక్షన్ 41A కింద నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇదే కేసులో అంకబాబును అరెస్టు చేసినందుకు కోర్టు సీఐడీ పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం గుర్తులేదా అంటూ నిలదీశారు. తెదేపా కార్యాలయంపై వైకాపా దాడి చేసి ఏడాది గడిచినా ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఐడీ తనంతట తానే ఒక చట్టం అని భావిస్తుందన్న చంద్రబాబు... వైకాపా ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోందన్నారు.