ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ.2 లక్షల కోట్ల బడ్జెట్.. ఆమోదమే ఎజెండాగా తెలంగాణ మంత్రివర్గ భేటీ

By

Published : Mar 17, 2021, 7:02 AM IST

ఆశావహ దృక్పథంతో సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు.. సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేయనుంది. చివరి త్రైమాసికంలో వచ్చిన గరిష్ఠ ఆదాయాల అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి. ఎప్పటిలాగే సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు పెద్దపీట, హామీల అమలుకు కేటాయింపులు చేసే అవకాశం ఉంది. బడ్జెట్‌కు ఆమోదంతో పాటు ఇతర అంశాలపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు.

Telangana Assembly sessions
తెలంగాణ: రెండు లక్షల కోట్ల బడ్జెట్.. ఆమోదమే ఎజెండాగా మంత్రివర్గ భేటీ

తెలంగాణ: రెండు లక్షల కోట్ల బడ్జెట్.. ఆమోదమే ఎజెండాగా మంత్రివర్గ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. సాయంత్రం ఏడు గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ఆమోదమే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం రేపు సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ కసరత్తు ఇప్పటికే పూర్తయింది.

ఆమోదముద్ర...

కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. బడ్జెట్ కేటాయింపులు, ప్రాధాన్యాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులకు వివరించనున్నారు. కరోనా కష్టకాలం, తదనంతర పరిణామాలు, రాష్ట్ర ఆదాయవనరులు, ఇతరత్రా అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఆశావహంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

పెరిగిన ఆదాయాలు...

కరోనా వల్ల ఆదాయాలు భారీగా పడిపోయినప్పటికీ... ఆ తర్వాత క్రమేణా పుంజుకోవడం వల్ల రాబడులు బాగానే వస్తున్నాయని, రానున్న ఆర్థిక సంవత్సరం ఇంకా బాగుంటుందన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని చెప్పారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు బాగా పెరిగాయి.

జీఎస్​డీపీలోనూ స్వల్పంగా వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. రానున్న ఏడాది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇంకా బాగుంటాయని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

రెండు లక్షల కోట్ల మార్కు!

రూ. లక్షా 82 వేల కోట్ల అంచనాతో 2020-21 బడ్జెట్​ను ప్రతిపాదించారు. దానిపై పదిశాతం అంచనాలు పెంచినా రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కును దాటే అవకాశం కనిపిస్తోంది. కేటాయింపుల్లో ఎప్పటి లాగే సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. సీతారామ, పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో పాటు నల్గొండ జిల్లాలో తలపెట్టిన వివిధ ఎత్తిపోతల పథకాలకు బడ్జెట్​లో నిధులు మంజూరు చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు.

దళిత సాధికారత కోసం...

దళిత సాధికారత కోసం ఈ మారు ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణ, నిరుద్యోగభృతి, కొత్త పింఛన్లు, ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహకాలు తదితరాలకు నిధులు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర పాలనా, రాజకీయపరమైన అంశాలపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు సహా వివిధ అంశాలకు సంబంధించి మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇవీ చూడండి:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి..!

ABOUT THE AUTHOR

...view details