ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారమిస్తే.. రూ.5వేల కోట్లతోనే రాజధానిని పూర్తి చేస్తాం: సోము వీర్రాజు

By

Published : Dec 14, 2020, 2:31 PM IST

Updated : Dec 15, 2020, 5:17 AM IST

ఏపీ ప్రజలకు అమరావతిలో అద్భుత రాజధానిని భాజపా నిర్మించి ఇస్తుందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని.. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ అమరావతి రైతులతోనే ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపాను గెలిపించాలని కోరారు.

somu verraju
సోము వీర్రాజు

అమరావతిలోనే రాజధాని ఉండాలన్నది తమ పార్టీ వైఖరి అని, ఉద్యమంలో రైతులతో పాటు తమ పార్టీ కూడా పాల్గొంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై విశ్వాసం ఉంచాలని, 2024లో రాష్ట్రంలో భాజపాకు అధికారం కట్టబెట్టాలని, తాము కేవలం రూ.5 వేల కోట్లతోనే రాజధానిని నిర్మిస్తామని, రూ.2 వేల కోట్లతో ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు ఇస్తామన్నారు. నిర్మాణాలు పోను మిగిలిన 9 వేల ఎకరాల్లో విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

'భారతీయ కిసాన్‌ సంఘ్‌' ఆధ్వర్యంలో తుళ్లూరులో సోమవారం నిర్వహించిన 'చిన్న, సన్నకారు రైతుల సమ్మేళనం'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. 'తొలి నుంచి తాము అమరావతిలోనే రాజధాని ఉండాలన్న మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశాం. నేను మోదీ ప్రతినిధిగానే ఇవన్నీ మాట్లాడుతున్నా. అభివృద్ధి చేసే వారికే అధికారం ఇవ్వాలి. అంతేకానీ మాట తప్పి, మడమ తిప్పే వారికి కాదు. రైతులకు ఇచ్చిన 64 వేల ప్లాట్లను అభివృద్ధి చేసి తీరాలన్నది భాజపా డిమాండ్‌. ఎన్నికల సమయంలో అమరావతిలోనే రాజధాని ఉంటుందని జగన్‌ చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని మా పార్టీ ఖండిస్తోంది. రాజధాని విషయంలో ప్రధాని మోదీ కలగజేసుకోవాలని చాలామంది అంటున్నారు. ప్రధాని అమరావతి అభివృద్ధికి కట్టుబడే ఉన్నారు. రైతులు, మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం అనవసర కేసులు పెట్టి వేధిస్తే భాజపా ఎట్టిపరిస్థితుల్లో సహించబోదు. ఏడాది నుంచి ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళల్ని జగన్‌ ప్రభుత్వం చర్చలకు పిలవాలి' అని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Last Updated : Dec 15, 2020, 5:17 AM IST

ABOUT THE AUTHOR

...view details