ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులో విచారణ

By

Published : Oct 12, 2021, 11:09 AM IST

Updated : Oct 12, 2021, 12:23 PM IST

ap high court
ap high court ()

11:07 October 12

సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ వేసింది. అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం ప్రత్యేక కోర్టు పంపింది. ఇళ్ల నిర్మాణాలను నిలిపివేస్తూ ఇటీవల సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. నెలలోపు నిపుణులతో కమిటీ వేసి అభిప్రాయ సేకరణ జరపాలని ఉత్తర్వులిచ్చారు. ఇళ్ల నిర్మాణాలపై అభిప్రాయ సేకరణ జరిపి నివేదిక ఇవ్వాలని గతంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నివేదిక వచ్చేవరకు ఇళ్ల నిర్మాణాలు ఆపాలని గతంలో ఉత్తర్వులు జారీ చేశారు.

          రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను హైకోర్టు ఇటీవల ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది.  

           ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో హైకోర్టులో  దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు. ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి.. ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది. ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని స్పష్టంచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూమి కొని, స్థలం విస్తీర్ణం పెంచి, లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకూ ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 367లోని మార్గదర్శకాలు-2,3, జీవో 488లోని క్లాజ్‌ 10,11,12, జీవో 99లోని క్లాజ్‌ బీ,డీలను చట్టవిరుద్ధమైనవంటూ, వాటిని రద్దుచేసింది.

ఇదీ చదవండి:  HIGH COURT: సెంటు స్థలంలో ఇల్లు ఎలా సాధ్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Last Updated :Oct 12, 2021, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details