ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నూతన బార్‌ పాలసీ ప్రకటించిన సర్కార్​.. మద్య నిషేధం హామీ ఊసేదీ..?

By

Published : Jun 18, 2022, 3:50 AM IST

మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లొదిలేసింది. 2025 ఆగస్టు వరకూ నిషేధం ఉండదని చెప్పకనే చెప్పింది. మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్ల విధానం ఖరారు చేసిన సర్కార్‌.. ఒక్క బారు కూడా తగ్గదని స్పష్టంచేసింది. ఇప్పుడున్నవి యధావిధిగా కొనసాగుతాయని తేల్చింది. 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్‌... ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారు.

AP Government announces new bar policy
AP Government announces new bar policy

"కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాత కేవలం 5స్టార్ హోటళ్లలోనే మద్యం లభ్యమయ్యేలా చేస్తాం" అని... 2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ ఇచ్చింది. దీనిద్వారా లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం నింపుతామని చెప్పింది.

2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో వైకాపా 151 సీట్లతో విజయం సాధించింది. గెలిచిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే... దిల్లీలో ప్రధాని మోదీని జగన్ కలిశారు. ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో... మద్యం ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటామని చెప్పారు.

ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జగన్‌ ఇచ్చిన దశలవారీ మద్యనిషేధ హామీకి... ఇప్పుడు తూట్లు పొడుస్తున్నారు. 2024 సంగతి అటుంచి... 2025 ఆగస్టు వరకూ అసలు మద్యనిషేధం ఊసే లేదని వైకాపా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకూ మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్ల విధానాన్ని శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా... వాటిలో ఒక్కటి కూడా తగ్గించబోమని స్పష్టంచేసింది. రాబోయే మూడేళ్లు 840 బార్లు యధావిధిగా కొనసాగుతాయని తేల్చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తాజా బార్ల విధానం ప్రకారం... 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితమయ్యే అవకాశం లేనట్లేనని నిర్ధరణ అవుతోంది.

వైకాపా అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. 2019 నవంబర్ 22న బార్ల లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ స్థానంలో కొత్తవాటి ఏర్పాటుకు రెండేళ్ల కాలపరిమితితో 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకూ నూతన బార్ల విధానాన్ని ప్రకటించింది. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా 840 బార్లలో 40శాతం బార్లను తగ్గిస్తున్నట్లు చెప్పింది. మిగతా 60శాతం బార్లకే లైసెన్సులు కేటాయిస్తామంటూ... 487 బార్లకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే 2022 జూన్‌ నెలాఖరు వరకూ కొనసాగే హక్కు ఉందంటూ అప్పట్లో బార్ల యజమానులు కోర్టును ఆశ్రయించడం, వారికి అనుకూలంగా తీర్పు రావటంతో.... ఆ బార్లు ఇప్పటివరకూ కొనసాగాయి. వాటి లైసెన్సు కాలపరిమితి ఈ నెల 30తో ముగియనుంది. తాజాగా కొత్త బార్ల విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం... బార్ల సంఖ్యను మాత్రం తగ్గించలేదు. 2019లో 40శాతం బార్లను తగ్గించిన ప్రభుత్వం... ఇప్పుడు మాత్రం ఎందుకు తగ్గించలేదన్న విమర్శలు వస్తున్నాయి.
సీఎం హామీ ఇచ్చినట్లు 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం కావాలంటే... కొత్త బార్ల విధానమే అవసరం లేదు. ఇచ్చినా, ఏడాది కాలపరిమితితో ఇవ్వాలి. అదీ బార్ల సంఖ్యను బాగా తగ్గించాలి. అందుకు విరుద్ధంగా మూడేళ్ల కాల పరిమితితో బార్ల విధానాన్ని ఖరారు చేశారు. అది కూడా ఇప్పుడున్న వాటిల్లో ఒక్క బార్‌నూ తగ్గించలేదు. ఇది మద్యనిషేధానికి తూట్లు పొడవటం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న బార్ల లైసెన్సుల కాల పరిమితిని ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ నెలాఖరుతో కాలపరిమితి ముగియాల్సి ఉండగా.... కొత్త బార్ల కేటాయింపునకు కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇప్పుడున్న లైసెన్సులను ఈ ఏడాది జులై 1 నుంచి ఆగస్టు 31 వరకూ పొడిగించింది. ఆ కాలపరిమితికి వర్తించే లైసెన్సు రుసుములు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్ని వసూలు చేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులిచ్చారు.

నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా ప్రాంతాలవారీగా వేలం కోసం అప్‌సెట్‌ ధర నిర్ణయిస్తారు. అధిక మొత్తం కోట్‌ చేసిన వారికి లైసెన్సు ఇస్తారు. ఆ తర్వాత వారు కోట్‌ చేసిన మొత్తంలో 90శాతం కోట్‌ చేసిన వారికి మిగతా బార్లను కేటాయిస్తారు. 90 శాతాని కంటే కొంత తక్కువగా కోట్‌ చేస్తే... ఆ మొత్తానికి సమానమైన సొమ్ము చెల్లించడానికి అంగీకరిస్తేనే బార్లు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము కింద 50వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో 5 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 7.5 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలుగా నిర్ణయించారు. ఈ సొమ్ము తిరిగి చెల్లించరు. నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ రుసుము, లైసెన్సు రుసుములను ఏటా 10 శాతం చొప్పున పెంచుతారు. త్రీస్టార్‌, అంతకంటే పైస్థాయి హోటళ్లు, మైక్రో బ్రూవరీస్‌లోని బార్లకు రిజిస్ట్రేషన్‌, లైసెన్సు రుసుము కలిపి ఏడాదికి 55 లక్షలుగా నిర్ణయించారు. ఏటా 10శాతం మేర పెంచుతారు. పర్యాటక బార్లు, క్లబ్బులకు ఇప్పుడున్న లైసెన్సు రుసుములే వర్తిస్తాయి. నగరపాలక సంస్థల్లో 10 కిలోమీటర్లు, పురపాలక సంఘాల్లో 3 కిలోమీటర్లు పరిధిలో బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్సైజ్‌ కమిషనర్‌, డిస్టిలరీ, బ్రూవరీస్‌ కమిషనర్‌, ఎక్సైజ్‌ అదనపు కమిషనర్‌ ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షిస్తారని ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details