ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామీణ స్వచ్ఛ సర్వేలో వెనుకబడిన రాష్ట్రం.. తెలంగాణకు తొలి స్థానం

By

Published : Oct 3, 2022, 6:50 AM IST

GRAMEEN SWACHH SURVEY 2022

GRAMEEN SWACHH SURVEY 2022 : గ్రామీణ స్వచ్ఛ సర్వే ఫలితాల్లో రాష్ట్రం వెనుకబడిపోయింది. కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం ఆదివారం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో రాష్ట్రం 12వ ర్యాంకుకు పరిమితమైంది. ఈ సర్వేలో పొరుగురాష్ట్రం తెలంగాణ జాతీయస్థాయిలో తొలిస్థానంలో నిలిచింది.

SWACHH SURVEY 2022 : గ్రామీణ స్వచ్ఛ సర్వే ఫలితాల్లో రాష్ట్రం వెనుకబడిపోయింది. కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం ఆదివారం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో రాష్ట్రం 12వ ర్యాంకుకు పరిమితమైంది. ఈ సర్వేలో పొరుగు రాష్ట్రం తెలంగాణ జాతీయస్థాయిలో తొలి ర్యాంకును సాధించడంతో పాటు, జిల్లాల కేటగిరీలో 31 జిల్లాలు టాప్‌-50లో నిలిచాయి. ప్రజాభిప్రాయం (350 మార్కులు), ప్రత్యక్ష పరిశీలన (300 మార్కులు), సేవల పురోగతి (350 మార్కులు) కొలమానాల ఆధారంగా మొత్తం 1,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో రాష్ట్రానికి 795.51 మార్కులే దక్కాయి.

పనితీరు ఆధారంగా దేశవ్యాప్తంగా 709 జిల్లాలకు ప్రకటించిన ర్యాంకుల్లో గుంటూరు 65వ స్థానంలో నిలిచింది. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర జల్‌శక్తి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, గిరిరాజ్‌సింగ్‌ల సమక్షంలో జరిగిన స్వచ్ఛభారత్‌ దివస్‌లో ఈ ర్యాంకులను ప్రకటించి విజేతలకు పురస్కారాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 17,559 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించగా.. మొత్తం 5,13,77,176 మంది ఇందులో తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 13 ఉమ్మడి జిల్లాల్లోని 397 గ్రామాల్లో నమూనాలు తీసుకున్నారు. 2021 సెప్టెంబరు 9న మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ సర్వేకు శ్రీకారం చుట్టారు. 2021 డిసెంబరు నుంచి 2022 ఏప్రిల్‌ మధ్యకాలంలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించారు. ఈసారి ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాలను సర్వే చేశారు. అన్ని గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు ఉన్న మౌలిక వసతులు, ఓడీఎఫ్‌, ఓడీఎఫ్‌+ అమలు తీరును, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ తీరును పరిశీలించారు.

ఈ సర్వేను ఇప్సోస్‌ రీసెర్చ్‌ అనే సంస్థ నిర్వహించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 98.1% కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో ఏపీ 18వ స్థానానికి పరిమితమైంది. 97.3% కుటుంబాలకు సొంత మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ విషయంలో 9వ స్థానంలో నిలిచింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details