ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెత్త ట్యాక్స్​కు కొత్త ఐడియా.. ఆస్తి పన్ను ఆధారంగా బాదుడు

By

Published : Aug 11, 2022, 4:52 AM IST

Garbage tax in ap: ప్రజలకు 'భారం' తెలియకుండా వారి నుంచి చెత్త పన్ను రాబట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది ప్రభుత్వం. వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్న చోట ఇళ్లకు ప్రజలు అర్ధ సంవత్సరానికి చెల్లిస్తున్న ఆస్తి పన్నును శ్లాబులుగా విభజించి వీటిపై చెత్త పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని రాష్ట్రంలో పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటైన విశాఖలో మొదట అమలు చేయనున్నారు.

garbage tax in ap
garbage tax in ap

Garbage tax in ap: చెత్త పన్నుపై ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాగైనా దీన్ని వసూలు చేయాలనే తలంపుతో ముందుకెళుతోంది. ప్రజలకు 'భారం' తెలియకుండా వారి నుంచి ఈ పన్ను రాబట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కొత్త ఆలోచన చేసింది. వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్న చోట ఇళ్లకు ప్రజలు అర్ధ సంవత్సరానికి చెల్లిస్తున్న ఆస్తి పన్నును శ్లాబులుగా విభజించి వీటిపై చెత్త పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ విధంగా చెత్త పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళిక తయారు చేసింది. ఈ విధానాన్ని రాష్ట్రంలో పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటైన విశాఖలో మొదట అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అక్కడి పాలకవర్గం ఆమోదించింది.

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరిస్తున్నందుకు పన్ను వసూలు చేయాలన్న నిర్ణయంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో పలు పుర, నగరపాలక సంస్థల్లో కనిష్ఠంగా 30, గరిష్ఠంగా రూ.120 చొప్పున చెత్త పన్ను వసూలు చేయాలని పాలకవర్గాలు మొదట తీర్మానించాయి. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా ఇప్పటికీ ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతున్నారు. దీనికితోడు చెత్త పన్ను అనగానే ప్రజలకు చిర్రెత్తుతోంది. ఈ పరిణామాలతో సీఎం సొంత జిల్లా కడప నగరపాలక సంస్థలో పాలకవర్గంతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెత్త పన్ను వసూళ్లు నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. విశాఖలోనూ చెత్త పన్ను వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. గత ఆరు నెలల్లో రూ.35 కోట్ల లక్ష్యంలో కేవలం రూ.12 కోట్లే వసూలు చేయగలిగారు.

ఎవరికీ మినహాయింపు లేదు
విశాఖలో ఆస్తి పన్ను ఐదు శ్లాబ్‌లుగా విభజించారు. వీటిపై చెత్త పన్ను నెలకు ఎంత వసూలు చేయాలో నిర్ణయించారు. ఉదాహరణకు అర్ధ సంవత్సరానికి కనిష్ఠంగా రూ.200 లోపు ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు నెలకు రూ.20 చొప్పున చెత్త పన్ను చెల్లించాలి. అర్ధ సంవత్సరానికి గరిష్ఠంగా రూ.4 వేలు కంటే మించి ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు చెత్త పన్ను రూ.120 చెల్లించేలా పాలకవర్గం తీర్మానించింది.

ఇవీ చదవండి:పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌పై పీపీఏ లేఖ వాస్తవమే

మరోసారి ముంపు ముప్పు.. గోదావరికి పెరుగుతున్న వరద

ABOUT THE AUTHOR

...view details