ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amaravati Padayatra: అశేష ప్రజానీకం మద్దతుతో కొనసాగుతున్న మహాపాదయాత్ర

By

Published : Sep 16, 2022, 8:38 AM IST

Amaravati Padayatra: అన్నదాతల అలుపెరగని పోరాటానికి, అన్నివర్గాల ప్రజల మద్దతు జత కలవడంతో మహాపాదయాత్ర... మహోద్ధృతంగా సాగుతోంది. నాలుగోరోజు పెదరావూరు నుంచి కొల్లూరు వరకూ సాగిన యాత్రలో అశేష ప్రజానీకం...రైతులతో పాటు కదం తొక్కారు. పలు రాజకీయ, ప్రజాసంఘాల నేతలు పాదయాత్రలో పాలుపంచుకున్నారు. రాజధానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్న పాలకులపై నిప్పులు చెరిగారు. అంతిమ విజయం అమరావతిదేనని స్పష్టం చేశారు.

Padayatra
మహాపాదయాత్ర

Amaravati Padayatra: రాష్ట్రం కోసం భూముల్ని త్యాగం చేసి, అమరావతి అభివృద్ధి కోసం మరోమారు రోడ్డెక్కిన రాజధాని రైతుల మహాపాదయాత్ర... నాలుగోరోజు బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతేనంటూ స్థానిక ప్రజలు అన్నదాతలకు బ్రహ్మరథం పట్టారు. పరిసర ప్రాంత వాసులే కాకుండా పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం యాత్ర చేస్తున్న కర్షకులపై బంతిపూల వర్షంలా కురిపించారు. పెదరావూరులో ప్రారంభమైన యాత్ర... జంపని నుంచి వేమూరు వరకూ జనప్రవాహంలా సాగింది. బూతుమల్లి, యలమర్రు, వరాహపురం తదితర గ్రామ వాసులు బైకులు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. తమ ఉద్యమానికి ప్రజా మద్దతు ఉందని, అంతిమ విజయం అమరావతిదేనని రైతులు స్పష్టం చేశారు.

మహాపాదయాత్ర

వేమూరు శివార్లలో మధ్యాహ్నం భోజనం కోసం విరామం తీసుకున్న రైతులు...ఆ తరువాత యాత్ర కొనసాగించారు. ఆకుపచ్చ జెండాలు, టోపీలు, కండువాలు ధరించిన రైతులతో పాదయాత్ర మార్గం ఆకుపచ్చని సంద్రాన్ని తలపించింది. ఉద్యమ గీతాలు, డప్పు మోతల మధ్య కదం తొక్కిన అన్నదాతలు... అసెంబ్లీలో సీఎం ప్రసంగాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఒక్క రాజధాని నిర్మించలేని జగన్‌... మూడు రాజధానులు ఎలా కడతారని నిలదీశారు.

అన్నదాతల పాదయాత్రలో తెదేపా నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, నన్నపనేని రాజకుమారి తదితర నేతలు సహా, భాజపా కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. రైతుల్ని అవమానిస్తున్న మంత్రులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం తన మెుండి వైఖరితో రాజధాని రైతులకే కాదు.. యావత్‌ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.

వేమూరు నియోజకవర్గ తెదేపా నాయకులు 18 లక్షల రూపాయల విరాళాన్ని నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా అమరావతి రైతులకు అందించారు. ఐదో రోజైన నేడు పాదయాత్ర కొల్లూరు నుంచి ప్రారంభమై ఐలవరం వరకూ సాగనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details