ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డెంగీ పేరిట దోపిడీ.. చికిత్స పేరిట రూ.లక్షల వసూళ్లు'

Extortion in the name of dengue :తెలంగాణలో 2019 తర్వాత మళ్లీ డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు​ ఆసుపత్రులు చికిత్స పేరిట రూ.లక్షలు వసూల్ చేస్తున్నాయి. అవసరం లేకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా ఫిర్యాదులుంటే 9154170960 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

'డెంగీ పేరిట దోపిడీ.. చికిత్స పేరిట రూ.లక్షల వసూళ్లు'
'డెంగీ పేరిట దోపిడీ.. చికిత్స పేరిట రూ.లక్షల వసూళ్లు'

By

Published : Jul 15, 2022, 9:23 AM IST

Extortion in the name of dengue : తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. ఇప్పటికే 1,300 డెంగీ కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా 600 దాటాయి. జూన్‌ నెలలోనే 565, జులై తొలి రెండు వారాల్లో 300కి పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. ఇవి అధికారిక లెక్కలు కాగా.. అనధికారికంగా వీటిసంఖ్య రెట్టింపు ఉంటుందని నిపుణుల అంచనా. 2019 తర్వాత మళ్లీ డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ చికిత్స పేరిట ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ తరహా ఫిర్యాదులుంటే ప్రైవేటు ఆసుపత్రులపై 9154170960 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ప్రకటించడంతో.. ఆరోగ్యశాఖకు ఫిర్యాదులొస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అధిక మొత్తంలో రుసుములు వసూలు చేసినట్లు రుజువైతే అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వరంగల్‌ జిల్లా రంగశాయిపేటకు చెందిన రమణ(35)కు 2 వారాల కిందట జ్వర మొచ్చింది. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే డెంగీ అని నిర్ధారించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయాలని సూచించడంతో ఆసుపత్రిలో చేరాడు. ప్లేట్‌లెట్లు లక్షకు తగ్గగానే.. వాటిని ఎక్కించాలని చెప్పి హడావిడి చేశారు. చివరకు వారం రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని నయమైందని ఇంటికి పంపించారు. రూ.2.5 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది.

మున్ముందు మరింత ప్రమాదం:మున్ముందు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మరింతగా వానలు కురిసే అవకాశాలుంటాయి. అప్పుడు దోమలు వృద్ధి చెంది వైరస్‌ వ్యాప్తికీ అనుకూలిస్తుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, గన్యా, మెదడువాపు వంటి విషజ్వరాలే కాకుండా.. కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ తదితర వ్యాధులూ విజృంభించే అవకాశాలున్నాయి. వీటితో పాటు ఏటా సెప్టెంబరు నుంచి మార్చి వరకూ కబళించే స్వైన్‌ఫ్లూ పొంచి ఉంది. వీటికి తోడు కొవిడ్‌ ఉద్ధృతి మొదలైతే.. ప్రజారోగ్యం అతలాకుతలమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.

రోగులపై అనవసర ఒత్తిడి:సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకూ ఉంటుంది. డెంగీ రోగులకు ఎప్పుడైతే ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోతుందో.. అప్పటినుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులను భయపెట్టే పర్వం ప్రారంభమవుతుంది. ఐసీయూ చికిత్స, గంటకోసారి పరీక్షలు, హడావిడిగా ప్లేట్‌లెట్లు ఎక్కించడంతో కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు వాపోతున్నారు.

అసలెప్పుడు ప్రమాదం?

* ఆయాసం

* కళ్లు తిరిగి పడిపోవడం

* కడుపునొప్పి, ఎడతెరపిలేని వాంతులు

* రక్తపీడనం తగ్గిపోవడం

* ముక్కు, పంటి చిగుళ్లు, ఇతర అవయవాల నుంచి రక్తం కారడం

* అపస్మారక స్థితి

సర్కారులో ప్లేట్‌లెట్‌ చికిత్స :రక్తం నుంచి పదార్థాలను విడగొట్టే అత్యాధునిక పరికరాన్ని వైద్య పరిభాషలో ‘హెవీ డ్యూటీ కూలింగ్‌ సెంట్రీఫ్యూజ్‌ మిషన్‌’ అంటారు. దీని ద్వారానే ప్లేట్‌లెట్లను విడగొడతారు. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం తదితర బోధనాసుపత్రులు సహా సూర్యాపేట, నల్గొండ, భద్రాచలం, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, నిర్మల్‌, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, తాండూరు, గద్వాల తదితర 20 ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు రూ.15 కోట్లతో ఆరేళ్ల కిందటే ఈ పరికరాలను బిగించారు. డెంగీ బాధితులకు ప్రభుత్వ వైద్యంలో అవసరమైతే అక్కడ ఉచితంగా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details