ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజ్యాంగానికి లోబడే పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు: దవే

By

Published : Dec 10, 2020, 5:30 AM IST

రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది దవే వాదనలు వినిపించారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

ap high court
ap high court

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం వివిధ కమిటీలతో అధ్యయనం చేసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాల విషయంలో జోక్యం చేసుకోవద్దని కోర్టును కోరారు. రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వర్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరపు వాదనల కొనసాగింపునకు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

రెండో రోజు విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది దవే వాదనలు వినిపిస్తూ... ' శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి ప్రభుత్వం హడావుడిగా రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మద్దతుతో అమరావతిని నిర్ణయించారు. మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకునే సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. భూములిచ్చిన రైతుల ప్రయోజనాల్ని కాపాడుతూ... సీఆర్​డీఏ రద్దు చట్టంలో రక్షణ కల్పించారు. ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ చట్టాన్ని తెచ్చింది' అని పేర్కొన్నారు. అనంతరం అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు ప్రారంభించారు. విభజన చట్టంలోని వివరాల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజధానిగా అమరావతి నిర్ణయించిన సందర్భంలో జారీచేసిన ఉత్తర్వుల గురించి వివరించారు. ప్రజాహితాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details