వివాదం లేకుండా రైతుకు భూమిని అప్పగించాలనేదే మా లక్ష్యం : మంత్రి పొంగులేటి
కేసముద్రంలో సబ్‌స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి - తాము వచ్చాక భూ తగాదాలు అన్నీ పరిష్కరిస్తున్నామని వెల్లడి - సున్నా వడ్డీకి ఎంత మొత్తం ఇచ్చారో బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్
Published : August 31, 2026 at 2:17 PM IST
|Updated : August 31, 2026 at 2:36 PM IST
Ponguleti Srinivasa Reddy Inaugurated a substation in Kesamudram :తాము అధికారంలోకి వచ్చాక భూ తగాదాలు అన్నీ పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిని బంగాళాఖాతంలో వేశామని, భూ భారతి తెచ్చామని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో సబ్‌స్టేషన్ ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.4.6 కోట్లతో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇనుగుర్తి, దంతాలపల్లి, సీరోలులో తహసీల్దార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బలరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
లేనిపోని విమర్శలు చేస్తున్నారు :తుంగతుర్తి, కేసముద్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేటప్పుడు కులం, మతం, పార్టీ ఏమీ అడగమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామంలో ఓట్లే అడగమని తేల్చి చెప్పారు. అబద్ధాలరావు తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు బీఆర్‌ఎస్ నేతలను నమ్మరన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం :వివాదం లేకుండా రైతుకు భూమిని అప్పగించాలనేదే తమ లక్ష్యమన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి, 125 ఏళ్లుగా తెలంగాణలో భూ సర్వే జరగలేదని తెలిపారు. ఎక్కడ కమీషన్లు వస్తాయో అక్కడే పదేళ్ల పాటు పని చేశారని ఆరోపించారు. సున్నా వడ్డీకి ఎంత మొత్తం ఇచ్చారో బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, నిరుద్యోగ యువతకు అండగా ఉన్నామని, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడి గుమ్మం వరకు చేరుస్తున్నామని, పదేళ్లు మీరేం చేశారో? వెయ్యి రోజుల్లో తాము ఏం చేశామో? ప్రజలే చెబుతారని పేర్కొన్నారు.
"మహబూబాబాద్‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. పరిపాలన అంటే ఇలా ఉండాలని జనం అనుకుంటున్నారు. పేదోడి కష్టం తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఏ ఎన్నిక వచ్చినా ప్రజాప్రభుత్వాన్నే గెలిపిస్తున్నారు. పేదవాడికి అండగా ఉన్నాం కనుకే ప్రతి ఎన్నికలోనూ గెలిపిస్తున్నారు. ఎవరో గగ్గోలు పెడితే మేం పనిచేస్తున్నామని అనుకుంటే అది వారి భ్రమ" -పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి
రాష్ట్రంలో త్వరలోనే లొసుగుల్లేని పటిష్ఠమైన రెవెన్యూ చట్టం : మంత్రి పొంగులేటి