IPL ముఖ్యమే అయినా టెస్ట్ క్రికెటే అన్ని ఫార్మాట్లకు బేస్- ఆటను అమ్మకూడదు, నేర్పించాలి: మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
క్రికెట్‌లో టెస్ట్ ఫార్మాట్ ప్రాధాన్యాన్ని వివరించిన భారత మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్- అన్ని ఫార్మాట్లకు టెస్టు క్రికెటే ప్రామాణికమని వెల్లడి- టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించాలని సూచన
Published : August 27, 2026 at 1:42 PM IST
Javagal Srinath On Test Format : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముఖ్యమైనదే అయినప్పటికీ, ఆటలోని లోతును అర్థం చేసుకోవడంలో టెస్ట్ క్రికెట్ ప్లేయర్స్‌కు సహాయపడుతుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌ను ఆయన అన్ని ఫార్మాట్లకు ప్రామాణికమని తెలిపారు. ఐపీఎల్, టీ20 వంటి క్రికెట్ ఫార్మాట్ల పట్ల ఆదరణ వేగంగా పెరుగుతున్నప్పటికీ టెస్ట్ క్రికెట్‌ను విస్మరించలేమని పేర్కొన్నారు. అలాగే క్రికెట్ వాణిజ్య క్రీడగా మారడంపైనా స్పందించారు. క్రికెట్‌ను అమ్మకూడదని, దానిని నేర్పించాలని వ్యాఖ్యానించారు. ఇందౌర్‌లో జరిగిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న శ్రీనాథ్ విలేకరులతో ఈ మేరకు మాట్లాడారు.
ఆట లోతు తెలియాలంటే టెస్టులు ఆడాల్సిందే : శ్రీనాథ్
"ఐపీఎల్, టీ20 వంటి క్రికెట్ ఈవెంట్లు మంచివే. అయితే టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడం చాలా అవసరం. టెస్ట్ క్రికెట్‌ను ఇప్పటికీ అన్ని ఫార్మాట్లకు ప్రామాణికమైనదిగా పరిగణిస్తారు. కేవలం పొట్టి ఫార్మాట్ ఆడే ఆటగాడు టెస్ట్ క్రికెట్‌లో రాణించడానికి తరచుగా ఇబ్బంది పడతాడు. అందుకు భిన్నంగా టెస్ట్ క్రికెట్‌లో పట్టు ఉన్న ప్లేయర్ టీ20లలో కూడా అద్భుతంగా రాణించగలడు. ఐపీఎల్ ముఖ్యమే. కానీ ఆటలో లోతును తెలుసుకోవాలంటే అది ఐదు రోజుల క్రికెట్ (టెస్ట్ క్రికెట్)లోనే సాధ్యమవుతుంది" అని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ స్పష్టం చేశారు.
'టీ20లకు ఎక్కువ ఆకర్షణ- అందుకే యువ క్రికెటర్లు అటు వైపే మొగ్గు'
టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు ప్రస్తుతం ఉన్న ఆదరణ గురించి కూడా శ్రీనాథ్ ప్రస్తావించారు. టీ20 మ్యాచ్‌లు ఎక్కువ ఆకర్షణను కలిగి ఉంటాయని చెప్పారు. అందుకే యువ క్రికెటర్లు టీ20 ఫార్మాట్ వైపు ఆకర్షితులు కావడం సహజమని పేర్కొన్నారు. అయితే ఏ ప్లేయర్ అయినా 15 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను నిర్మించుకోవాలనుకుంటే తప్పనిసరిగా టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించారు. ఎందుకంటే టీ20లలో ఆటగాళ్లను తరచుగా రొటేషన్ పద్ధతిలో మారుస్తుంటారని చెప్పారు. టెస్ట్ క్రికెట్‌ను యంగ్ ప్లేయర్స్ మరింత సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. అందుకు ఆటగాళ్ల తల్లిదండ్రులు, రాష్ట్ర సంఘాలు, కోచ్‌లు మొదలైనవారు యువ క్రికెటర్లకు ఆట విషయంలో సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
క్రికెట్ కూడా వ్యాపార క్రీడగా మారిపోతుందని శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. "క్రికెట్ అనేది కోచింగ్ ద్వారా నేర్పించాల్సిన క్రీడ. అమ్మాల్సిన ఉత్పత్తి కాదని నేను భావిస్తున్నాను. నేను కూడా అనేక పరిణామాలను గమనిస్తూనే ఉన్నాను. క్రికెట్ వాణిజ్యీకరణకు గురికాకుండా చూడటం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌తో సహా అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల బాధ్యత. " అని శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు.
జ్యోతిరాదిత్య సింధియా ఏమన్నారంటే?
మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA)ను క్రికెట్ దేవాలయంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీనాథ్ ఇక్కడ ఉండటం ఎంతో గౌరవప్రదమైన విషయమని కొనియాడారు. శ్రీనాథ్ క్రికెట్‌కే కాకుండా యావత్ దేశానికి గర్వకారణమని తెలిపారు. క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఆటగాళ్లను శ్రీనాథ్ సమక్షంలో సత్కరించడం సంతోషకరమని అన్నారు. క్రికెట్‌కు ఎంపీసీఏ అందిస్తున్న సహకారం చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందన్నారు.
అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న శ్రీనాథ్
ఇందౌర్‌లోని బ్రిలియంట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన MPCA అవార్డుల ప్రదానోత్సవంలో మాజీ క్రికెటర్ శ్రీనాథ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, MPCA అధ్యక్షుడు మహా ఆర్యమాన్ సింధియా పాల్గొన్నారు. అక్కడ అంతర్జాతీయ, జాతీయ, దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు, జట్లను సత్కరించారు. కూచ్ బెహార్ ట్రోఫీ విజేతగా నిలిచిన మధ్యప్రదేశ్ అండర్-19 జట్టు రూ.73,83,750 నగదు బహుమతిని అందించారు. టీమ్ఇండియాకు ఎంపికైన మధ్యప్రదేశ్ ఆటగాళ్లను కూడా ఇదే వేదికపై సత్కరించారు. సారాంశ్ జైన్, ఆనంద్ తగడే, యశ్వర్ధన్ చౌహాన్, మనల్ చౌహాన్ ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నగదు బహుమతిని అందించారు. ఆర్యన్ పాండే, చంచల్ రాథోడ్‌లను 'ఉత్తమ క్రికెటర్ అవార్డు'తో గౌరవించారు. మధ్యప్రదేశ్ క్రికెట్‌కు విశేష సేవలు అందించిన ఇద్దరు దిగ్గజాలకు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'ను ప్రదానం చేశారు.