ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్నికల కోడ్ ఉల్లంఘన - వీఆర్వోను సస్పెండ్ చేసిన ఈసీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 6:19 PM IST

VRO_suspended_in_srikakulam_district

VRO Suspended in Srikakulam District : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ తొలివేటు వేసింది. అధికార వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ చేసి వీఆర్వో రమేష్ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావటంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖా పరంగానూ వీఆర్వో రమేష్​పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.

మరోవైపు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీల ఆనవాళ్లను తొలగిస్తున్నారు. పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను సిబ్బంది తీసేస్తున్నారు. సీఈవో ఆదేశాలను పట్టించుకోకుండా కొన్నిచోట్ల ఫ్లెక్సీలు, జెండాలు ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details