ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రుషికొండపై హడావుడిగా 'ప్యాలెస్‌' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 9:00 AM IST

Government No Clarity on Rushikonda Construction: ప్రకృతి విధ్వంసానికి పాల్పడి రుషికొండను తవ్వేశారు. 450 కోట్లు ప్రజాధనాన్ని కుమ్మరించి భవనాలు నిర్మించారు. వారం క్రితం వాటిని ప్రారంభింపజేశారు. ఆ భవనాలు దేనికి వినియోగిస్తారు అంటే మాత్రం మంత్రులకూ స్పష్టత లేదు. ఈ విడ్డూరమంతా చూస్తున్న ప్రజలు రుషికొండ సౌధమేమన్నా రాజకోట రహస్యమా అని ప్రశ్నిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

రుషికొండపై హడావుడిగా 'రిసార్టు' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?

YSRCP Government No Clarity on Rushikonda : ఏ చిన్న పని పూర్తి చేసినా అంతులేని హడావుడి చేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండ రిసార్టు విషయంలో మాత్రం అయోమయంలో ఉంది. వైఎస్సార్సీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో అత్యంత వేగంగా జరిగిన భారీ ప్రాజెక్టు ఇదే. వందల కోట్లు కుమ్మరించి ప్యాలెస్‌ నిర్మించారు. అలాంటి రాజసౌధం ప్రారంభోత్సవం జరిగి వారం కావస్తున్నా దానిని ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా వాటిని ప్రారంభించిన మంత్రులూ చెప్పలేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసి కొన్నిచోట్ల పండగ వాతావరణంలో ప్రారంభిస్తున్న వైసీపీ ప్రభుత్వం, 450 కోట్లు ఖర్చు చేసి కట్టి, రిబ్బన్‌ కత్తిరించిన ప్యాలెస్‌ను మాత్రం ఖాళీగా ఉంచేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రహస్యంగా రుషికొండ రిసార్ట్ ప్రారంభం - ప్రభుత్వం నుంచి కొద్దిమందికే ఆహ్వానాలు

రుషికొండ రీడెవలప్‌మెంట్‌ రిసార్ట్‌ పేరుతో తీర ప్రాంత నియంత్రణ జోన్‌ అనుమతులు పొందగా అదే పేరుతో ఆ భవనాలను కొద్ది రోజుల కిందటే ప్రారంభించారు. వేంగి ఎ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బీ, సీ ఇలా మొత్తం ఏడు బ్లాకుల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంకెట్‌ హాళ్లు, గెస్ట్‌ రూములు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్‌ గేమ్స్, ఫిట్‌నెస్‌ సెంటర్, బ్యాక్‌ ఆఫీస్‌ వంటివి అభివృద్ధి చేశామని అధికారులు చెబుతున్నారు. పర్యాటకావసరాలకైతే ప్రారంభోత్సవం రోజే అప్పగించొచ్చు. వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ భవనాలను ఉపయోగించుకోకుండా ఎందుకు నిరీక్షిస్తున్నారో అంతుపట్టడం లేదు.

వాస్తవానికి ఆ భవనాలు పర్యాటక, ఆతిథ్య సేవలకు అనువుగా లేవని సమాచారం. పేరుకు మాత్రమే పర్యాటక రంగానివని చెబుతున్నా వాటిని అధికార పెద్దల అవసరాల మేరకే తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంటే బాగుంటుందని ఓ మంత్రి పేర్కొనగా, పర్యాటక రిసార్టుగా కొనసాగించాలా, సీఎం కార్యాలయంగా వినియోగించాలా అన్నది ఇంకా నిర్ణయించలేదని మరో మంత్రి చెప్పడం రుషికొండపై నెలకొన్న గందరగోళానికి మచ్చుతునక.

రుషికొండ నిర్మాణాలపై హైకోర్టుకు నిపుణుల కమిటీ నివేదిక - తదుపరి విచారణ వాయిదా

రుషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంగా ఉన్న హరితా హిల్‌ రిసార్టు భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, విపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి, ఎంతమంది అడ్డు చెప్పినా పెడచెవిన పెట్టి, వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం ఆ భవనాలను ఖాళీగా ఉంచడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రుషికొండను పరిశీలించిన కేంద్ర కమిటీ - విధ్వంసం, నిర్మాణాలపై ఆరా

ABOUT THE AUTHOR

...view details