ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 7:23 AM IST

Women Died After Drinking Contaminated Water: గుంటూరులో కొద్దిరోజులుగా సరఫరా అవుతున్న కలుషిత తాగునీరు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. శారదా కాలనీకి చెందిన పద్మ అనే యువతి మరణించగా మరో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. నగరంలో కలుషిత నీరు వస్తోందని ప్రజలు కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్నా అధికార యంత్రాంగం స్పందించలేదు. యువతి మృతి, విపక్షాల ఆందోళనలతో అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారు.

Women_Died_After_Drinking_Contaminated_Water
Women_Died_After_Drinking_Contaminated_Water

ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు

Women Died After Drinking Contaminated Water: గుంటూరులోకలుషిత నీరు తాగి ఓ యువతి మరణించడం తీవ్ర కలకలం రేపింది. శారదా కాలనీకి చెందిన పద్మ అనే యువతి శుక్రవారం అనారోగ్యం పాలైంది. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడిన ఆమెను శనివారం ఉదయం జీజీహెచ్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ పద్మ మధ్యాహ్న సమయంలో మరణించింది. మృతురాలి తండ్రి 2 నెలల క్రితమే గుండెపొటుతో మృతిచెందగా, కుమార్తె మృతి వార్తతో తల్లి ఆసుపత్రి పాలైంది.

పద్మ ఉండే ప్రాంతంలోని మరో ముగ్గురు వాంతులు, విరేచనాలతో సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్‌ కాలనీ, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన మరి కొందరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల క్రితం సంగడిగుంటకు చెందిన ఓబులు అనే వ్యక్తి డయేరియాతో మరణించాడు. అప్పుడే అధికారులు మేల్కొని ఉంటే ఇప్పుడు ఇంత మంది ఆస్పత్రి పాలయ్యేవారు కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరు వాసులకు నీటి కష్టాలు తప్పవా - అధికారులు పట్టించుకోరా!

గుంటూరు ప్రజలు కలుషిత తాగునీటితో అవస్థలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం, జనసేన ధ్వజమెత్తాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని ఆరోపించారు. యువతి మృతి చెందిన శారదా కాలనీ 50వ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి డిప్యూటీ మేయర్‌ బాల వజ్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైపులైన్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

మురుగు కాలవల నుంచి నీరు కుళాయిల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. అలాగే వారం రోజుల నుంచి నీరు సరిగా రావటం లేదని స్థానికులు చెబుతున్నారు. రంగు మారటంతో పాటు పురుగులు కూడా వచ్చాయని తెలిపారు. విషయాన్ని సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లామన్నారు. శారదా కాలనీలో గత వారం రోజుల్లో 20 మందికి పైగా అస్వస్థత పాలయ్యారు. అయితే వీరంతా జీజీహెచ్​కు వెళ్లకుండా స్థానికంగా చికిత్స తీసుకున్నారు.

కలుషిత నీరు తాగి 15 మందికి అస్వస్థత - ముగ్గురి పరిస్థితి విషమం

యువతి మృతి చెందడంతో నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఎవరైనా అనారోగ్యం పాలయ్యారా అనే వివరాలు సేకరిస్తున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన తాగునీరు గురించి అవగాహన కల్పిస్తున్నారు.

మరోవైపు వాంతులు, విరేచనాలతో గుంటూరు జీజీహెచ్‌లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని మంత్రి విడదల రజని అన్నారు. అస్వస్థతకు గురై చికిత్స పొందతున్న వారిని మంత్రి పరామర్శించారు. ఆహారం, నీటి నమునాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. బాధితుల్ని పరామర్శిచేందుకు వచ్చిన మంత్రిని ఆస్పత్రి బయట బీజేపీ నేతలు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూడా అందించలేక పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైపులైన్ల లీకులతో ఇబ్బందులు- కలుషిత నీటితో అల్లాడుతున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details