War Of Words Between Bandi Sanjay KTR : పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొన్ని పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరీనంగర్‌లో సోషల్ మీడియా వారియర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలకు పదును పెట్టారు. మూడు సార్లు ఓడి పోయాం, నాలుగుసార్లు ఓడిపోయాం అంటూ కన్నీళ్లు పెట్టి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 420 హామీలు నెరవేర్చకపోతే ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీని ఓటుతో బుద్ది చెప్పాలని కేటీఆర్ కోరారు. మరోవైపు కరీంనగర్ నుంచి గెలుపొందిన ఎంపీ బండి సంజయ్ గత ఐదేళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.
'కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించండి'
"కన్నీళ్లు పెట్టి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మానకొండురు, చొప్పదండి, వేములవాడ, హుస్నాబాద్‌లో గెలిచిన అభ్యర్థులు 420 హామీలు నెరవేర్చకపోతే ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించే బాధ్యత మనదే. కాంగ్రెస్ పార్టీని హామీలు నెరవేర్చేవరకు ఎట్టి పరిస్థితిలో విడిచి పెట్టే ప్రసక్తే లేదు. ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ డిసెంబరు 9న చేస్తామని ప్రకటించిన వారు ఇప్పుడు నోరు మెదపట్లేదు. రైతు బంధు రానివారు రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు వేస్తే, కాంగ్రెస్ హాయంలో మూడు నెలలు గడుస్తున్న రైతులంతా ఆలోచించాలి. ఒక వైపు అడ్డుగోలు హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకునే ప్రయత్నాలు ఒకవైపు, వాళ్ల కుప్పిగంతులు మరొకవైపు, ఇలాంటి నేతలు ఎన్నికకావడం మన దురదృష్టం. ఇవాళ తెలంగాణలో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. బండి సంజయ్ వంటి నాయకులు వచ్చాక బొట్టు పెట్టడం నేర్పించారు." - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Bandi Sanjay VS KTR : కేటీఆర్ విమర్శలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్‌తో పాటు గ్రామాల్లో అభివృద్ది ఏ నిధులతో జరిగాయో సర్పంచులను అడగాలని సూచించారు. అభివృద్ది ఎవరి నిధులతో జరిగిందో కేసీఆర్, కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు, బీఆర్ఎస్ నాయకులకు హిందుత్వం గురించి నేర్పామని ఎద్దేవా చేశారు. పదవుల కోసం పారాచూట్‌లో దిగిన కేటీఆర్ తన రాజకీయాల గురించి నైతిక హక్కులేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.