ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మేం రాజీనామా చేయం'- వైఎస్సార్సీపీ నేతలకు వాలంటీర్ల షాక్​ - Volunteers Resignation in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 6:59 AM IST

Volunteers Resignation in AP: వాలంటీర్లంతా మా సైన్యమేనని చెప్పుకున్న వైసీపీ నేతలకు ఇప్పుడు ఊహించని ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. రాజీనామా చేయాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నా, వాలంటీర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.56 లక్షల్లో రాజీనామా చేసింది కేవలం 3.11 శాతమే మాత్రమే. రాజీనామా చేస్తే ఉద్యోగం పోతోందని, పైగా రాజీనామా చేసిన తర్వాత వైసీపీ నేతల ప్రచారాల్లో తిరగాల్సి వస్తుందని, ఆ తర్వాత కేసులు పెడితే తామే నష్టపోతామని వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Volunteers Resignation in AP
Volunteers Resignation in AP

రాజీనామా చేయబోమంటున్న జగనన్న సైన్యం

Volunteers Resignation in AP: వాలంటీర్లతో రాజీనామా చేయించి పార్టీ ప్రచారం కోసం వారిని ఉపయోగించుకోవాలని అనుకున్న వైసీపీ నేతల కుయుక్తులు బెడిసి కొడుతున్నాయి. రాజీనామా చేసేందుకు అనేక చోట్ల వాలంటీర్లు ససేమిరా అంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తమ జోలికి రావొద్దని గట్టిగా చెబుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వాలంటీర్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో నేతలకు చుక్కెదురైంది.

వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలను ఇప్పటివరకు అమలు చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు వారితో రాజీనామాలు చేయించి పార్టీ కోసం ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగపడతారని ఆశపడిన నేతలకు వాలంటీర్లు ఎదురు తిరగడంతో నివ్వెరపోతున్నారు. ఎన్నికల ప్రక్రియ నుంచి పింఛన్ల పంపిణీ వరకు వాలంటీర్లను ఎన్నికల కమిషన్‌ దూరం పెట్టడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. వీరి ద్వారా ఓటర్లకు తాయిలాలు పంచి ప్రలోభపెట్టే కార్యక్రమాలు విస్తృతం చేయాలని భావించిన నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
వాలంటీర్‌ వ్యవస్థ తొలగింపుపై ఈసీ పునరాలోచించుకోవాలి: తమ్మినేని సీతారాం - Speaker Tammineni Press Meet


రాష్ట్ర వ్యాప్తంగా 2.56 లక్షలకుపైగా ఉన్న వాలంటీర్లలో ఇప్పటివరకు 7,963 మంది అంటే 3.11 శాతం మాత్రమే రాజీనామా చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి అసెంబ్లీ నియోజవర్గాల్లో నాలుగు రోజుల క్రితం వాలంటీర్లతో వైసీపీ నేతలు నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో రాజీనామా చేయాలని నాయకులు కోరగా వాలంటీర్లు విభేదించారు. కృష్ణా జిల్లాలో ఒక మంత్రి తరఫున ఆయన అనుచరులు నిర్వహించిన సమావేశానికి అత్యధిక సంఖ్యలో వాలంటీర్లు గైర్హాజరయ్యారు. రాజీనామాలు చేయించేందుకు సమావేశం నిర్వహించారన్న విషయం తెలిసి అటు వెళ్లలేదు. విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వాలంటీర్ల వద్ద రాజీనామా అంశం ప్రస్తావనకు తేగానే అభ్యంతరం తెలిపారు.
వైఎస్సార్సీపీ 'వాలంటీర్లు'- ఎన్నికల ప్రచారంలో 'తగ్గేదేలే'- ఈసీ ఆదేశాలంటే లెక్కేలేదు! - Volunteers in Election Campaign


వైసీపీ శాసనసభ అభ్యర్థులకు కొద్ది రోజుల క్రితం వరకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రచారం చేసిన వాలంటీర్లలో చాలామందికి కేసుల భయం పట్టుకుంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికల కోడ్‌తో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయి. పింఛన్ల పంపిణీ బాధ్యత కూడా లేకపోవడంతో కొందరు ఉదయమే సచివాలయాలకు వెళ్లి ఉద్యోగులకు కనిపించి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు సచివాలయాలకూ వెళ్లడం తగ్గించారు. వాలంటీర్లలో డిగ్రీ, పీజీలు చేసిన వారున్నారు. ఓటర్లకు తాయిలాలు ఇస్తూ పట్టుబడి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉందని వీరు భయపడుతున్నారు. వాలంటీర్లలో గృహిణులూ ఉన్నారు. కేసులు నమోదైతే కుటుంబ పరువు పోతుందని, తర్వాత తమను ఎవరు రక్షిస్తారని కూడా వైసీపీ నేతలను వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే కంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంట్లో కూర్చోవడమే మేలని వీరు భావిస్తున్నారు.

పింఛన్​ ఎందుకు ఆపారు ? - విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన సామాన్యుడు - pension distribution issue

ABOUT THE AUTHOR

...view details