ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న ఏలుబడిలో - పడకేసిన రైల్వే ప్రాజెక్టులు - railway projects in AP

YCP Govt neglects on railway projects: కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉండే రైల్వే ప్రాజెక్టులకైనా పట్టాలెక్కేలా నిధుల కేటాయింపులో వైసీపీ నిర్లక్ష్యం వహించింది. రైల్వే ప్రాజెక్టులపై ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క రూపాయీ కేటాయించలేదు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టుల మీద వైసీపీ నిర్లక్ష్యంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

railway projects in AP
railway projects in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 10:21 AM IST

Updated : Apr 10, 2024, 1:43 PM IST

జగనన్న ఎలుబడిలో - పడకేసిన రైల్వే ప్రాజెక్టులు

YCP Govt neglects on railway projects:రాష్ట్రవాటా కింద నిధులివ్వండంటూ రైల్వేశాఖ మొత్తుకున్నాసరే, దున్నపోతుపై వర్షం పడినట్లే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. దీనివల్ల రాష్ట్రంలో ఏ ఒక్క కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టు పనులూ ముందుకు కదల్లేదు. రాష్ట్రంలో మరిన్ని రైల్వే ప్రాజెక్టులనూ చేజేతులా బొందపెట్టేలా చేసిన రికార్డుని జగన్‌ ప్రభుత్వం నమోదు చేసుకుంది.

అమరావతి కొత్తలైన్‌ నిర్మాణంపైనా అంతే నిర్లక్ష్యం:రాజధానిపై కక్షకట్టిన వైసీపీ ప్రభుత్వం, అమరావతి కొత్తలైన్‌ నిర్మాణంపైనా అంతే నిర్లక్ష్యం ప్రదర్శించింది. రాజధాని అమరావతి ప్రాంతానికి గుంటూరు, విజయవాడలతో అనుసంధానం అయ్యేలా రైల్వేలైన్‌ మంజూరయ్యేలా చంద్రబాబు ప్రభుత్వం ఎంతో శ్రమించింది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.8 కిలోమీటర్ల డబుల్‌లైన్, అమరావతి-పెద్దకూరపాడు మధ్య 24.5 కిలో మీటర్ల సింగిల్‌ లైన్, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కిలో మీటర్ల సింగ్‌లైన్‌ కలిపి అమరావతి మీదగా గుంటూరు-విజయవాడ మధ్య 106 కిలో మీటర్ల మేర కొత్త రైల్వేలైన్‌ మంజూరైంది. దీనికి 2017లో 3 వేల 273 కోట్లు వ్యయమవుతుందని డీపీఆర్‌ తయారు చేశారు. అయితే వ్యయం ఎక్కువగా ఉందని, ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య ప్రస్తుతానికి సింగిల్‌ లైన్‌కే అంచనా రూపొందించాలని రైల్వేబోర్డు సూచించింది. దీంతో ఈ మేరకు మళ్లీ డీపీఆర్‌ తయారుచేసి రైల్వే బోర్డుకు పంపారు. అక్కడి నుంచి ఈ దస్త్రం నీతి ఆయోగ్‌కు 2018 చివర్లో వెళ్లింది. తర్వాత జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రాజెక్టుపై సంసిద్ధత తెలపాలంటూ రైల్వేశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. అమరావతి ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం ఆకాక్షించకుండా కక్ష తీర్చుకుంటున్న జగన్‌, రైల్వే లైన్‌కు తన సమ్మతి తెలపకుండా అయిదేళ్లూ గడిపేశారు.

కడప నుంచి బెంగళూరుకు రైల్వేలైన్‌పైనా కక్ష సాధింపే: సీఎం జగన్‌ తన సొంత జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుకే మోకాలడ్డారు. తండ్రి వైఎస్‌ కడప నుంచి బెంగళూరుకు రైల్వేలైన్‌ ప్రాజెక్టు మంజూరు చేయించి, పనులు ఆరంభిస్తే, తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులు వేగంగా జరిగేలా చూసింది. జగన్‌ హయాంలో దీనికి రూపాయి కూడా ఇవ్వకుండా, భూసేకరణ చేపట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాదు, ఈ రూటు మార్చాలంటూ కొత్త ప్రతిపాదనని తెరపైకి తెచ్చి, కాలయాపన చేస్తున్నారు. కడప నుంచి బెంగళూరు వరకు 255 కిలో మీటర్ల మేర కొత్త లైన్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ 2008-09లో మొదలైంది. ఇందులో ఏపీలో 205 కిలో మీటర్లు, కర్ణాటక పరిధిలో 50 కిలో మీటర్లు ఉంది. కడప-పెండ్లిమర్రి, పెండ్లిమర్రి-రాయచోటి, రాయచోటి-వాయలపాడు, మదనపల్లిరోడ్‌-మదగట్ట వరకు ఏపీ పరిధిలో నాలుగు దశల్లో ఈ పనులు జరగాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని రాష్ట్రమే సేకరించడంతో పాటు, నిర్మాణ వ్యయంలో 50 శాతం భరించాలి. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 2 వేల850 కోట్లు. గత ప్రభుత్వాలు190 కోట్లు ఇచ్చాయి. దీంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. లైన్‌ మాత్రమే పూర్తయింది. తర్వాత నుంచి ఆగిపోయింది. ఈ మార్గంలో మార్పులు చేయాలంటూ జగన్‌ ప్రభుత్వం రైల్వేబోర్డుకు లేఖరాసింది. ప్రస్తుతం పెండ్లిమర్రి వరకు లైన్‌ పూర్తికాగా, అక్కడి నుంచి పులివెందుల మీదగా ముదిగుబ్బ వరకు కొత్త లైన్‌ నిర్మించి, అక్కడి నుంచి ధర్మవరం-బెంగళూరు లైన్‌లో కలపాలని ప్రతిపాదించింది. అలాగే ముద్దనూరు నుంచి పులివెందులకు మరో లైన్‌ నిర్మించి, కడప-పెండ్లిమర్రి-పులివెందుల-ముదిగుబ్బ లైన్‌కు లింక్‌ కలపాలంది. ఈ ప్రతిపాదనలకు రైల్వేశాఖ ఆశ్చర్యపోయింది. ప్రాజెక్టు నిర్మాణం సగంలో ఉండగా మార్పు సాధ్యంకాదని రైల్వేశాఖ చెబుతోంది.

రాష్ట్ర వాటా నిధులివ్వకుండా నిర్లక్ష్యం: విజయవాడ-చెన్నై రైల్వే లైన్‌కు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి లైన్‌కు 2012-13లో ప్రతిపాదన ఉండగా 2016 మంజూరైంది. న్యూ పిడుగురాళ్ల నుంచి నుంచి శావల్యపురం, గుండ్లకమ్మ, దర్శి, పొదిలి, కనిగిరి, ఓబులాయపల్లె, రాపూరు మీదగా వెంకటగిరి వరకు 309 కిలో మీటర్ల పొడవైన నడికుడి-శ్రీకాళహస్తి లైన్‌కు 2 వేల 700 కోట్లు వ్యయమవుతుందనేది అంచనా. ఈ ప్రాజెక్టు మంజూరవ్వగానే గత తెదేపా ప్రభుత్వం శరవేగంగా భూసేకరణ జరిపింది. రైల్వేశాఖకు సంపూర్ణ సహకారం అందించి, వేగంగా పనులు జరిగేలా చేసింది. దీంతో న్యూపిడుగురాళ్ల-శావల్యపురం మధ్య 47 కిలోమీటర్ల కొత్తలైన్‌ విద్యుదీకరణతోపాటు పూర్తయింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక దీనికి రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు రైల్వేశాఖ ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చుచేసింది. రాష్ట్రవాటా ఇవ్వాలని కోరుతున్నా.. జగన్‌ సర్కారు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చూపిస్తోంది.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని కోనసీమ ప్రాంతం మీదగా రైల్వే లైన్‌ నిర్మాణం స్థానికుల చిరకాల స్వప్నం. కోటిపల్లి నుంచి అమలాపురం, పాసర్లపూడి, జగ్గంపేట, రాజోలు మీదగా నర్సాపురం వరకు 57.21 కిలోమీటర్ల కొత్త లైన్‌ 2000-01లో ప్రతిపాదించగా 2012లో తుది మంజూరు జరిగింది. ఇప్పటికే రైల్వేశాఖ ఈ ప్రాజెక్టులో 11 వందల కోట్లకుపైగా ఖర్చుచేసింది. 367 కోట్లు డిపాజిట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వేశాఖ కోరుతున్నా, జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. దీంతో రైల్వేలైన్‌లో భాగంగా గౌతమి, వైనతేయ, వశిష్ఠ గోదావరిలపై వంతెనల నిర్మాణం మొక్కుబడిగా సాగుతున్నాయి.

సిటీ సెంటర్లుగా మారనున్న రైల్వేష్టేషన్లు- ఈ నెల 26న ప్రధాని మోదీ శంకుస్థాపన

కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం మీదగా కర్ణాటకలోని తుముకూరు వరకు 207 కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ 2007-08లో మంజూరైంది. ఇందులో ఏపీలో 94 కిలో మీటర్లు, కర్ణాటకలో 113 కిలో మీటర్లు నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 వేల 404 కోట్లుకాగా, ఇందులో సగం ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు వెచ్చించాల్సి ఉంది. రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం మీదగా కదిరిదేవరపల్లి వరకు 63 కిలోమీటర్ల వరకు లైన్‌ గత ప్రభుత్వ హయాంలో పూర్తయింది. మన రాష్ట్ర పరిధిలో మిగిలిన 31 కిలోమీటర్ల పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర వాటాగా 484 కోట్ల రూపాయలు రైల్వేకి ఇవ్వాల్సి ఉండగా, ఇందులో గత ప్రభుత్వాలు 260 కోట్లు వెచ్చించాయి. జగన్‌ ప్రభుత్వం మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు.

నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపురం, రాయదుర్గం-తుముకూరు కొత్త రైల్వే లైన్ల పనులకు సంబందించి రాష్ట్ర వాటా ఇవ్వలేమంటూ రాష్ట్రప్రభుత్వం రైల్వే బోర్డుకు లేఖలు రాసింది. అంత డబ్బులేదని, కావాలంటే భూసేకరణ భరిస్తామని, ఇందుకు అనుమతించాలని జగన్‌ సర్కారు వేడుకుంది. అయితే దీనిపై రైల్వేబోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

'రాబోయే కొన్నేళ్లలో 1000 అమృత్‌ భారత్‌ రైళ్లు- ప్రతివారం పట్టాలపైకి ఒక ట్రైన్'

Last Updated : Apr 10, 2024, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details