PIL in High Court on Volunteers in Election Duties: ఎన్నికలకు సంబంధించిన విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీకి ప్రయోజనం కలిగే విధంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేయాలని, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సపోర్టు చేయవద్దని వాలంటీర్లను సీఎం కోరారని వ్యాజ్యంలో తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య ఈ పిల్ వేశారు.
జగన్ అక్రమాస్తుల కేసు - 2 నెలల్లో తేల్చాలని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
ఇలాంటి పరిస్థితుల్లోవాలంటీర్లు ఎన్నికల్లో నిష్పాక్షికంగా పనిచేస్తారని ఆశించలేమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్వహించిన వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన రాజకీయ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లకు ఎన్నికల సంబంధించిన పనులు అప్పగించకుండా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ), కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పోలింగ్ బూత్ ప్రాంగణాల్లోకి వెళ్లకుండా వాలంటీర్లను నిరోధించాలని అభ్యర్థించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లా ఎన్నికల అధికారులంతా సరైన స్ఫూర్తితో అమలు చేసేలా సీఈఓను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు. వాలంటీర్లను అభినందిస్తూ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవం, జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమాల నిర్వహణ, అందుకు సంబంధించి పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా సొమ్ము వెచ్చించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల ద్వారా అంతిమ ప్రయోజనం వైసీపీ పొందిందన్నారు.