Love Murder in Medak : తమ్ముడి పెళ్లి అన్న మరణానికి కారణమైంది. ఇద్దరు ప్రేమికుల నిర్ణయం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ప్రేమించిన అమ్మాయితో జీవిత కాలం బతకాలని ఆ యువకుడు తీసుకున్న నిర్ణయమే అతడి సోదరుడిని బలి తీసుకుంది. తన చెల్లి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె సోదరుడు కోపోద్రిక్తుడయ్యాడు. క్షణికావేశంలో తన చెల్లి వివాహమాడిన వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న అతడి సోదరుడిని కిరాతకంగా హతమరార్చాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :మెదక్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన పోతరాజు ఉదయ్‌కు అదే కాలనీకి చెందిన భవానీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమ గురించి తెలిసిన ఇరు కుటుంబాలు పెళ్లికి ససేమిరా అన్నాయి. వాళ్లని ఒప్పించే ప్రయత్నం చేసినా అంగీకరించలేదు. ఏం చేయాలో పాలుపోక, విడిపోలేక ఉదయ్, భవానీ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు పక్కాగా ప్లాన్ వేసుకున్నారు.
Bride Brother Killed Groom Brother Medak :ఇటీవల ఇంట్లో నుంచి ఉదయ్, భవానీ పారిపోయి హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలో స్నేహితులు, తెలిసిన వారి సాయంతో ఎలాగోలా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కాస్తా ఆ నోటా ఈ నోటా ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు ఈ విషయం తెలిసి కోపోద్రిక్తులయ్యారు. ముఖ్యంగా యువతి సోదరుడు అంజిత్ ఈ ఇద్దరి కోసం తీవ్రంగా గాలించాడు. ఎక్కడ వెతికినా వారి ఆచూకీ లభించలేదు.
చివరకు ఆదివారం రోజున మెదక్‌లోని ఉదయ్ ఇంటికి వెళ్లాడు అంజిత్. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఉదయ్ సోదరుడు నగేశ్ (25)ను నిలదీశాడు. వాళ్లిద్దరు ఎక్కడున్నారో చెప్పాలని అడిగాడు. నగేశ్ తనకు తెలియదని చెప్పినా యువతి సోదరుడు వినిపించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అంజిత్ నగేశ్‌ను కత్తితో దాడి చేశాడు. గమనించిన ఇరుగుపొరుగు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపైనా దాడికి తెగబడటంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నగేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. విషయంపై స్థానికులను ఆరా తీశారు. నగేశ్ హత్యకు అతడి తమ్ముడు ఉదయ్ ప్రేమ పెళ్లి చేసుకోవడమే కారణమై ఉంటుందని స్థానికులు పోలీసులతో చెప్పారు. పోలీసులు కూడా అదే కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన తర్వాత వెల్లడిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. నగేశ్‌పై దాడి చేసిన అంజిత్ కోసం ప్రస్తుతం గాలిస్తున్నట్లు వెల్లడించారు.