ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అస్మదీయులకు దోచిపెట్టేందుకే - మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనుక భారీ స్కెచ్‌!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 9:08 AM IST

Huge Sketch Behind the Mangampet Muggurai Tenders: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్‌ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్‌ బయటపడింది. ఏపీఎమ్​డీసీకి వందల కోట్ల నష్టం చేకూర్చి, ఓ బయ్యర్‌కు మేలుచేసే వ్యూహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏటా పిలవాల్సిన టెండర్లను ఐదేళ్లకు కలిపి ఒకేసారి పిలవడం వెనుక ప్రభుత్వ పెద్దల అస్మదీయులకు కోట్లు కట్టబెట్టే కుట్ర దాగి ఉంది.

Huge Sketch Behind the Mangampet Muggurai Tenders
Huge Sketch Behind the Mangampet Muggurai Tenders

అస్మదీయులకు దోచిపెట్టేందుకే - మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనుక భారీ స్కెచ్‌!

Huge Sketch Behind the Mangampet Muggurai Tenders :అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం మంగంపేట వద్ద ఏపీఎమ్​డీసీ కి ముగ్గురాయి గనులు ఉన్నాయి. చమురు వెలికితీసే కంపెనీలు దీన్ని వినియోగిస్తుండటంతో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడ తవ్వితీసే ముగ్గురాయిలో ఏ, బీ, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌లకు ఏటా టెండర్లు పిలిచి, బయ్యర్లను ఎంపిక చేస్తారు. సాధారణంగా ఏటా 15 నుంచి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకే సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ల ముగ్గురాయిని బయ్యర్లు తీసుకుంటారు. ఐతే ఈ ఏడాది జనవరి 24న ఏపీఎమ్​డీసీ అధికారులు ఐదేళ్ల కాలవ్యవధికి కోటి మెట్రిక్‌ టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయికి ఒకేసారి టెండరు పిలిచారు. ఇందులో టెండరు ధరావతు 90 కోట్లు, టెండరు డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు 29న్నర లక్షల రూపాయల ఫీజు చెల్లించాలి. బిడ్‌ దక్కించుకునే గుత్తేదారు కాంట్రాక్టు విలువలో 50 శాతం, అంటే దాదాపు 600 కోట్లు మేర పెర్ఫార్మెన్స్‌ సెక్యూరిటీగా డిపాజిట్‌ చేయాలన నిబంధనల్ని విధించారు. ఓ కీలక బయ్యర్‌కు ఈ టెండరు దక్కేలా ఇదంతా చేశారనే విమర్శలొచ్చాయి.

ప్రస్తుతం మంగంపేట గనుల్లో కీలకమైన ఏ గ్రేడ్‌ నిల్వలు చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకు ఏ గ్రేడ్‌ ముగ్గురాయి లభించదు. ఆ తర్వాత బీ గ్రేడ్‌తోపాటు, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌లకు డిమాండ్‌ ఏర్పడుతుంది. ఏటా టెండర్లు నిర్వహిస్తే వీటి ధర క్రమంగా పెరుగుతుంది. కానీ ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి, ఒకేసారి ఐదేళ్లకు టెండరు పిలిచారు. రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచినప్పుడు ఏ గ్రేడ్‌కు మెట్రిక్‌ టన్ను ధర 6,691 రూపాయలు, బీ గ్రేడ్‌ 5,225, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయి 16వందల 70 రూపాయలు పలికింది.

ముగ్గురాయి టెండరూ అస్మదీయులకే - డిమాండ్‌ ఉన్నా తక్కువ ధరకే

వీటికి సీనరేజ్, సెస్, జిల్లా ఖనిజ నిధి, మెరిట్, జీఎస్టీ తదితరాలు అందనం! తాజాగా పిలిచిన టెండర్లలో సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల రిజర్వ్‌ ధర మెట్రిక్‌ టన్నుకు 1200 రూపాయలుగా పేర్కొన్నారు. ఇప్పటికే మెట్రిక్‌ టన్ను ముగ్గురాయిని బయ్యర్లు 1,670 రూపాయలకు కొంటుండగా అందులో 470 రూపాయలు తగ్గించి 1,200 రూపాయలుగా తాజా టెండరులో పేర్కొన్నారు. అంటే కోటి మెట్రిక్‌ టన్నుల టెండరు దక్కించుకున్న బయ్యర్‌కు ఐదేళ్లలో 470 కోట్ల రూపాయలు మిగులుతాయి. పెరగనున్న డిమాండ్‌తో సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయి ధర మెట్రిక్‌ టన్ను 2 వేల నుంచి 2వేల 500 దాకా చేరొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుతం మెట్రిక్‌ టన్ను 1,200 రూపాయలకే బిడ్‌ దక్కించుకునే బయ్యర్‌ మున్ముందు మార్కెట్‌లో రెట్టింపు ధరకు విక్రయించి భారీగా లాభపడనున్నారు.

APMDC: జోరుగా ముగ్గురాయి అక్రమ రవాణా.. సిబ్బంది మధ్య విభేదాలతో వెలుగులోకి

మంగంపేట ప్రాంతంలో పల్వరైజింగ్‌ మిల్లులు, విదేశీ కంపెనీలతో సంబంధాలు కలిగి ముగ్గురాయి ఎగుమతుల్లో కొంతకాలం 'విక్రమా'ర్కుడిలా పైచేయి చూపిస్తున్న ఓ బయ్యర్‌ కోసం ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. అతనికి ఏపీఎమ్​డీసీ కీలక అధికారితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో టెండరును ఎలాగైనా అతడి సంస్థకే దక్కేలా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ టెండర్లలో లొసుగులు, ఇందులో విధించిన నిబంధనలపై పత్రికల్లో వరుస కథనాలతో ఏపీఎండీసీ అధికారులు వెనక్కు తగ్గి కీలక బయ్యర్‌కు బిడ్లు వేయొద్దని సూచించినట్లు తెలుస్తోంది. చివరకు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదని టెండర్లు రద్దు చేశారు. ముందుగా అనుకున్నట్లు ప్రణాళిక ప్రకారం టెండర్లు జరిగి ఉంటే ఏపీఎండీసీ వందల కోట్లు నష్టపోయేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పేలుళ్లతో వణుకుతున్న పల్లెలు.. ముగ్గురాయి గనిలో ఎడతెరపి లేకుండా పనులు

ABOUT THE AUTHOR

...view details