ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో దాహం కేకలు, అధికారుల చర్యలపై ప్రజల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 12:31 PM IST

Guntur City Drinking Water: ఇప్పటివరకూ ఎన్నడూ లేని రీతిలో గుంటూరు నగరవాసులకు తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. కలుషిత నీరు తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతేకాక వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆరా తీయగా, హడావుడిగా పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

guntur_city_drinking_water
guntur_city_drinking_water

అధికారుల చర్యలకు తాగునీటికి అల్లాడుతున్న గుంటూరు నగరవాసులు

Guntur City Drinking Water:గుంటూరు నగర వాసుల్ని ఎన్నడూ లేని రీతిలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. 3 వారాలుగా పలు కాలనీల ప్రజలు కలుషిత నీటి వల్ల అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కార్పొరేషన్ సరఫరా చేసిన తాగునీటి వల్ల వందలాది మంది అస్వస్థతకు గురికాగా డయేరియా లక్షణాలతో అధికారికంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

దీనిపై న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆరా తీయడంతో హడావుడిగా స్పందించిన కార్పొరేషన్ అధికారులు పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేయడంతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. దీంతో నగరంలో తాగునీటి సమస్య మరింత జటిలమైంది. కార్పొరేషన్ సరఫరా చేసే నీటిని ధైర్యంగా తాగలేక, మినరల్ వాటర్ అందుబాటులో లేక గుంటూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మరింతగా పెరిగిన డయేరియా కేసులు- ఆందోళన వద్దంటున్న మంత్రి రజనీ

సరైన ప్రణాళిక లేకుండా, ప్రజారోగ్యంపై శ్రద్ధ లేకుండా గుంటూరు కార్పొరేషన్ అధికారులు చేస్తున్న పనులు నగరవాసుల తాగునీటి కష్టాల్ని రెట్టింపు చేస్తున్నాయి. పాత పైపు లైన్లు మార్చి కొత్త లైన్లు వేసే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తాగునీటి పైపులైన్లకు పలు చోట్ల లీకులు ఏర్పడ్డాయి. దీంతో నీరు కలుషితమై ముగ్గురు మరణించగా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు.

వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నా సమస్యకు కారణాలు తెలుసుకోకుండా నగరపాలక సంస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో అధికారులు కంటితుడుపు చర్యల్లో భాగంగా మినరల్ వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. 20కి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రమాణాలు పాటించడంలేదని, నాణ్యత లేని నీటిని విక్రయిస్తున్నాయని మూసేశారు.

తాగునీటి ఇక్కట్లు - గంటల తరబడి పడిగాపులు

నాలుగున్నరేళ్లుగా ఎప్పుడూ మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేయని అధికారులు ఇప్పుడు హఠాత్తుగా సీజ్ చేయడం వల్ల తాగునీటి సమస్య మరింత పెరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. డయేరియా కేసులు అధికంగా నమోదైన శారదకాలనీ, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే అరకొరగా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తే మిగిలిన కాలనీల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. కలుషిత నీటి వల్ల వందలాది మంది ఇబ్బంది పడుతున్నా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

మినరల్ వాటర్ ప్లాంట్లు సరైన ప్రమాణాలు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలని నగరవాసులు కోరుతున్నారు. పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేసి శుద్ధమైన తాగునీరు అందించే వరకూ ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరులో రోజురోజుకీ పెరుగుతున్న డయేరియా బాధితులు- మృతుల సంఖ్యపెరగడంపై ఆందోళన!

ABOUT THE AUTHOR

...view details