Minister Botsa Vs EX Minister Ganta : ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణను వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టాలంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే సరైన అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది.
చీపురుపల్లి నుంచి శాసనసభకు 4 సార్లు పోటీ చేసిన బొత్స, 3 సార్లు విజయం సాధించారు. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఆయన పోటీ దాదాపు ఖాయమైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చోడవరం నుంచి విజయం సాధించారు. 2009లో అనకాపల్లి నియోజవర్గం నుంచి, 2014లో భీమిలి, 2019లో విశాఖపట్నం ఉత్తరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం- దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలంటూ ఆందోళన
కంచుకోటలో పాగా వేసే దిశగా: చీపురుపల్లిలో గంటాను బరిలోకి దింపడం ద్వారా మంత్రి బొత్సను ఓడించాలని టీడీపీ అధిష్ఠానం ఆలోచించింది. గంటా అయితే బలమైన అభ్యర్థి అవుతారని, టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంటుందని సర్వేల్లోనూ తేలినట్లు సమాచారం. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న చీపురుపల్లిలో మళ్లీ పాగా వేసేలా తెలుగుదేశం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.