ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చల్లపల్లి రాజావారి కోట - విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే!

చల్లపల్లి సంస్థానాన్ని 1860లో పరిపాలించిన యార్లగడ్డ వంశీయులు - నాటి సంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోన్న కోట

Challapalli Rajavari Fort In Krishna District
Challapalli Rajavari Fort In Krishna District (EENADU)

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 19, 2025 at 10:20 AM IST

Challapalli Rajavari Fort In Krishna District: రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్న చల్లపల్లి రాజావారి కోట రాజసం ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. దేవరకోట సంస్థానానికి రాజధానిగా వెలుగు వెలిగింది. చల్లపల్లి గ్రామంలో ఈ వారసత్వ సంపద నాటి సంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నేటికి నిలుస్తోంది. ఎత్తయిన స్తంభాలతో ఠీవిగా కనిపించే ఈ కోటలో ఒక్కో పిల్లరు వద్ద ఉన్న రాతి శిల్పాలు రాచదర్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అదే విధంగా చూపు తిప్పుకోనివ్వని శిల్పాలు, పింగాణీ జాడీలు, అరుదైన గృహోపకరణాలు ఎన్నో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడంతో పాటు ఆ నాటి కాలానికి తీసుకెళ్తాయి.

పర్యాటక క్షేత్రంలా:ఈ కోట 20 ఎకరాలలో భారీ బురుజులు, భవంతులు, వందల సంవత్సరాల నాటి భారీ వృక్షాలతో ప్రాంగణం అలరారుతోంది. ఎంట్రీ గేట్ దగ్గరి కంచు గంట చల్లపల్లి వాసులకు గడియారంలా మారింది. నేటికీ గంటగంటకూ ఆ గంటను కొడుతుంటారు. అరుదైన సంపదను ఇంకా అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అప్పుడప్పుడూ కోటలో పురావస్తు ప్రదర్శనలు జరుగుతున్నా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపడితే పర్యాటక క్షేత్రంగా రాణిస్తుంది.

చల్లపల్లి వాసులకు సమయం తెలిపే గంట ఇదే (EENADU)

విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటకు వెళ్తే, అక్కడికి దగ్గర్లోని కూచిపూడి నృత్య కళాక్షేత్రం, మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం, పెదకళ్లేపల్లిలోని శ్రీదుర్గా నాగేశ్వరస్వామి ఆలయాలనూ చూడొచ్చు. ఇవన్నీ అక్కడికి గరిష్ఠంగా 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి.

కోట ముఖ ద్వారం (EENADU)

ఈ అపురూప నిర్మాణం:ఎన్నో చారిత్రక అంశాలను పదిల పర్చుకున్న ఈ కోటను 1860లో చల్లపల్లి సంస్థానాన్ని పరిపాలించిన యార్లగడ్డ వంశీయులు నిర్మించారు. అలాగే ఇక్కడ నుంచే దేవరకోట సంస్థానాన్ని 20 మంది జమీందారులు పాలించారు. వారిలో మొదటి జమీందారు యార్లగడ్డ గుర్హనీడు(1576-1607).

చల్లపల్లిరాజావారి కోట (EENADU)

ఈ అపురూపమైన నిర్మాణాన్ని అంకినీడు ప్రసాద్‌ బహుద్దూర్‌ అనే జమీందారు హయాం(1846 -1875)లోనే కట్టించారు. ఈయన కుమారుడైన యార్లగడ్డ శివరామప్రసాద్‌ బహుద్దూర్‌ 23 ఏళ్లకే 1929లో పరిపాలనా పగ్గాలు చేపట్టి జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు కూడా పాలించారు. ఆయన కుమారులు మల్లికార్జునప్రసాద్, అంకినీడు ప్రసాద్, పద్మనాభ ప్రసాద్‌. వీరిలో అంకినీడు ప్రసాద్‌ 1967లో మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికై సేవలందించారు. వీరి వారసులు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉంటున్నారు. ఇప్పటికీ చల్లపల్లి కోటకు వచ్చి వెళుతుంటారు.

లోపలి భాగంలో విశాలమైన సమావేశ మందిరం (EENADU)

కళ్లకు కడుతున్న రెడ్డిరాజుల ఘన చరిత్ర, కొండవీడు వైభవం - ఎక్కడంటే?

Heritage Museum on Reddy Kings : తెలుగు గడ్డపై ప్రజారంజక పాలన అందించిన రెడ్డిరాజుల ఘన చరిత్రను భావి తరాలకు అందించడానికి అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య వారు ప్రత్యేక మ్యూజియంను నిర్మించారు. రెడ్డిరాజుల ఘన చరిత్ర, చారిత్రక విశిష్టత, కొండవీడు గత వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో పల్నాడు జిల్లా కొండవీడు సమీపంలో ఉన్న ఫిరంగిపురం మండలం హౌస్‌గణేష్‌ గ్రామంలో రెడ్డి రాజుల వారసత్వ మ్యూజియం నిర్మించారు.

రెడ్డిరాజులు ఏలిన కొండవీడు, గద్వాల్‌ సంస్థానం, ఉదయగిరి, ఆత్మకూరు, వనపర్తి, దూమకొండ తదితర ప్రదేశాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఈ సమాచారాన్ని నిపుణుల కమిటీ సభ్యులు సేకరించి ఇక్కడ ఆకర్షణీయమైన రీతిలో అందుబాటులో ఉంచారు. కొండవీడు కోట నమూనా 24 అడుగుల వెడల్పు, 36 అడుగుల పొడవుతో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది. ఆ కాలం నాటి శిలా, తామ్ర శాసనాల నమూనాలు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు మొదలైన ఇతర వస్తువులు నాటి వైభవానికి అద్దం పడుతున్నాయి.

పెనుకొండ పర్యాటక అభివృద్ధికి ముందడుగు - పనులు ప్రారంభం