ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ అధికారులు అంతా చింతించే రోజు తప్పకుండా వస్తుంది: సిటిజన్స్ ఫర్‌ డెమోక్రసీ - CFD on Officers and Volunteers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 7:35 PM IST

Updated : Apr 7, 2024, 6:09 AM IST

CFD on Officers and Volunteers: ఎన్నికల తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పి ఓట్లు అభ్యర్థించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. అధికారులు నిష్పక్షపాత వైఖరి కోల్పోయి ఒక రాజకీయ పార్టీకి అండదండగా పనిచేస్తున్నారో వారంతా చింతించే రోజు తప్పకుండా వస్తుందని సీఎఫ్​డీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్‌ ఎల్‌.వి.సుబ్రమణ్యం అన్నారు. తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లం కాదంటూ ఘాటుగా స్పందించారు.

CFD on Officers and Volunteers
CFD on Officers and Volunteers

ఆ అధికారులు అంతా చింతించే రోజు తప్పకుండా వస్తుంది: సిటిజన్స్ ఫర్‌ డెమోక్రసీ

CFD on Officers and Volunteers: అధికారులు నిష్పక్షపాత వైఖరి కోల్పోయి, ఒక రాజకీయ పార్టీకి అండదండగా పనిచేస్తున్నారో వారంతా చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ (Citizens for Democracy) సంస్థ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్ ఎల్‌.వి.సుబ్రమణ్యం అన్నారు. ప్రవర్తన లోపాలతో మచ్చలేని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అబాసుపాలు చేయొద్దని హితవు పలికారు.

వ్యవస్థాగతంగా అనేక విమర్శలు వచ్చిన తరుణంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల వ్యవస్థ పనికిరాదని, వినియోగించకూడదని, ఆక్షేపించిన తర్వాత ప్రత్యామ్నాయానికి ఇంత సమయం తీసుకోరాదని తెలిపారు. తమ బాధ్యతను విస్మరించి ఇతరులపై నింద వేయడం సరికాదని అన్నారు. ఎన్నికలు అనేవి వేగవంతంగా వస్తోన్న నిజమని, కానీ అధికార యంత్రాంగం ఇందుకు తగిన సమాయత్తంతో ఉన్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. వాలంటీర్లు తమ పదవికి రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లుగా పనిచేయడం సమర్ధనీయం కాదని సీఎఫ్​డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్నారు.

రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తారో చెప్పి ప్రజలను ఓట్లు అడగండి : నిమ్మగడ్డ - Citizens for Democracy meeting

LV Subramanyam Comments: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించి, ఆదరించి, ఆచరించి పోటీ చేసే అభ్యర్ధులందరికీ నమ్మకాన్ని కలిగించాల్సిన తరుణం వచ్చిందని సెటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పోటీలో నిలిచే ప్రతి అభ్యర్ధి తనకు గెలుపు అవకాశం రావాలని ఆశిస్తుంటారని, ఈ సమయంలో అధికార యంత్రాంగం పనితీరు, వారి ప్రవర్తన ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఎన్నికల వేళ జిల్లా కలెక్టరు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు, ఎస్పీ మొదలు డీజీపీ వరకు అంతా నిష్పక్షపాత వైఖరిని చూపించాలని అంతా ఆశిస్తారని ఎల్‌.వి.సుబ్రమణ్యం అన్నారు.

రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థ గురించి వచ్చిన అనేక విమర్శలను పరిగణనలోకి తీసుకునే తమ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ వ్యవస్థను వినియోగించరాదని ఈసీ ఆదేశించిన తర్వాత ప్రత్యామ్యానికి ఇంత సమయం తీసుకోరాదని అన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తాము లేఖలు రాస్తున్నామని, వాటిని పరిశీలించి జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేయడంలో ఆలోచనలు, సమాలోచనలకు ఎక్కువ సమయం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ఇంకా ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సమాయత్తం అవుతున్నట్లు కనిపించడంలేదని ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. శాశ్వతంగా ఒక్కరే అధికారంలో ఉంటారని ఆశించడం తప్పుకాదని, కానీ దురాశతో ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లం కాదంటూ ఘాటుగా స్పందించారు.

ఏపీలోనే అత్యధిక ఎన్నికల వ్యయం- అధికార పార్టీ అక్రమాలకు అంతేలేదు: CFD

Nimmagadda Ramesh Kumar Comments: వాలంటీర్లపై వ్యక్తిగతంగా తనకు సానుభూతి ఉందని, కానీ వ్యవస్థ సరిగా లేదని సీఎఫ్​డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలిపారు. దేశంలో అన్ని చోట్ల లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాల లబ్ధి చేరుతుంటే, వాలంటీరు వ్యవస్థ ఉంటేనే వారి వద్దకు పథకాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న వాదన సరికాదని హైకోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. ఫించన్ల పంపిణీలో అలసత్వం లేకుండా చూడాలని ఈసీ చేసిన ఆదేశాలు విఫలమయ్యేలా చేయడంలో ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతామన్నారు.

వాలంటీర్లు రాజకీయ ప్రయోజనాలకు పనిచేస్తే, అది రాజకీయ దుర్వినియోగం కిందకు వస్తుందని నిమ్మగడ్డ అన్నారు. హఠాత్తుగా రాజీనామాలు చేసి ఏజెంట్లుగా కూర్చోవడం సమర్ధనీయం కాదన్నారు. వాలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్న అధికారపక్ష విధానం తిరోగమన చర్య కాగా, కొద్దిపాటి మార్పులతో అదే వ్యవస్థను కొనసాగించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ విధానం అవకాశవాదంతో కూడిందని సీఎఫ్​డీ విమర్శించింది.

ఎన్నికల సంఘం ఆదేశాలను సీఎం జగన్‌ ధిక్కరించారు: లక్ష్మణరెడ్డి

Last Updated : Apr 7, 2024, 6:09 AM IST

ABOUT THE AUTHOR

...view details