ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వేతనం వెయ్యి పెంపు - సంక్షేమాలన్నీ కట్ - అంగన్వాడీలపై 'జగన్మాయ' - Anganwadi Problems in YSRCP Govt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 10:10 AM IST

Anganwadi Problems in YSRCP Government : 'అన్న వస్తున్నాడు' అంటే ఆనందపడ్డారు ! 'మాట తప్పడు' అంటే మురిసిపోయారు! అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచితే తమ ఇళ్లలో రెండు పూటల పొయ్యి వెలుగుతుందనుకున్నారు ! కానీ ఈతాకు ఇచ్చి తాటాకు తీసుకున్నట్లు అప్పటిదాకా అందుతున్న సంక్షేమాలను రద్దు చేశారు. వేతనాలు పెంచాలన్న తమ వేదనలను వెక్కిరిస్తూ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపారు. అక్క చెల్లెమ్మలంటూనే జగన్‌ అంగన్వాడీలకు వెన్నుపోటు పొడిచారు.

anganwadi_problems_in_ysrcp_government
anganwadi_problems_in_ysrcp_government

వేతనం వెయ్యి పెంపు - సంక్షేమాలన్నీ కట్ - అంగన్వాడీలపై 'జగన్మాయ'

Anganwadi Problems in YSRCP Government :పాలన అంటే సచ్ఛీలత. చేసే పని చెప్పే మాట నిక్కచ్చిగా ఉండాలి. ఇవే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. కానీ ముఖ్యమంత్రి జగన్‌లో ఇవి ఇసుమంతైనా కనిపించవు. ఆయనలో కనిపించేదంతా జిత్తులమారితనమే. అడుగడుగునా కుయుక్తి పన్నడమే. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఏ వర్గానికైనా సరే ఐదేళ్ల పాలనలో ఆయన చేసిందిదే. అక్క చెల్లెమ్మలంటూనే అంగన్‌వాడీలను ఇదే తరహా వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి రాగానే తెలంగాణలో కంటే వేతనాలు పెంచి అమలు చేస్తామని గత ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ హామీనిచ్చారు. ఎన్నికల్లో గెలవగానే ఆయన తీరు ‘బోడి మల్లయ్య’ చందంగా మారింది. అంగన్‌వాడీల వేతనం వెయ్యి రూపాయలు పెంచి దానికి మించి వారికి అందే సంక్షేమ పథకాలల్లో కోత విధించారు.

రాష్ట్రవ్యాప్తంగా 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. లక్ష మూడు వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పని చేస్తున్నారు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. జగన్‌ వచ్చాక వీరికి వేతనాన్ని వెయ్యి రూపాయలు పెంచారని అంగన్‌వాడీలు సంబరపడ్డారు. కానీ ఆ పెంపు వెనక ముంపును వారు ఊహించలేకపోయారు. ఇటు వేతనం పెంచుతూనే అటు సంక్షేమ పథకాలు, నవరత్నాల అమలుపై జగన్‌ సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది. వాటిలో కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయలు మించకూడదనే ఆదాయ పరిమితి అస్త్రాన్ని ఒకటి అంగన్‌వాడీలపై ప్రయోగించారు. వేతనం 10 వేలకు మించిందంటూ గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీల సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. అప్పటికిగాని అంగన్‌వాడీలకు జగన్మాయ అర్థం కాలేదు.

రూపాయి వేతనం పెంచకపోయినా సమ్మె విరమించిన అంగన్వాడీలు - నేటి నుంచి విధుల్లోకి

No Welfare Schemes to Anganwadis : అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. అయినా అంగన్‌వాడీలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం వేతనాల పెంపులో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం, పేదల సంక్షేమాన్ని చూస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. ఐదేళ్ల పాలనలో టీడీపీ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని 4వేల 200 నుంచి 10వేల500కి పెంచింది. రెండు విడతల్లో వీరికి 150 శాతం అంటే 6వేల 300 మేర పెంచి వేతనాన్ని తెలంగాణతో సమం చేసింది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు 103శాతం, ఆయాలకు 172శాతం పెంచింది. అప్పటి నిబంధనల ప్రకారం వారి వేతనం ఆదాయ పరిమితిని దాటి సంక్షేమ పథకాల లబ్ధి దూరమయ్యే అవకాశం ఉన్నా కోత మాత్రం విధించలేదు. వెసులుబాటు ఇచ్చి అన్ని పథకాలను వారికి వర్తింపచేసింది.

జగన్‌ అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల వేతనం 10వేల500 నుంచి 11వేల500 పెంచారు. ఏతావాతా ఆయన పెంచింది 9.5 శాతమే. అది కూడా 2019 జూన్‌లో పెంచారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఓవైపు సంక్షేమ పథకాలు అందక మరోవైపు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి అంగన్‌వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొన్ని నిత్యావసరాల ధరలు దాదాపు 100 శాతం పెరిగాయి. దీన్ని పరిగణనలోకి తీసుకునే తెలంగాణ ప్రభుత్వం 2021లో అక్కడి అంగన్‌వాడీ కార్యకర్తలకు 3వేల150 చొప్పున వేతనం పెంచింది. ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తామన్న జగన్‌ మాత్రం కిమ్మనకుండా ఉన్నారు. చివరికి హామీని నెరవేర్చాలంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టినా కనీసం వారి మాట కూడా ఆలకించలేదు. పోలీసులతో ఉక్కుపాదం మోపించారు. వారికి వర్తించని ఎస్మాను కూడా ప్రయోగించి బెదిరింపులకు దిగారు. ఉద్యోగాలను తొలగిస్తామని మెడ మీద కత్తిపెట్టినట్లుగా దారుణంగా వ్యవహరించారు.

అంగన్వాడీలు జాయినింగ్​ రిపోర్ట్​ ఇవ్వాల్సిందే !- కలెక్టర్లు ఆదేశాలు

No Increment to Anganwadi AP :అంగన్‌వాడీల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిన జగన్‌ ప్రభుత్వం వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ పింఛన్లు కూడా నిలిపి వేసింది. అమ్మఒడి సాయాన్ని అందించకుండా వారి పిల్లల చదువును ఇబ్బందిపెట్టారు. ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణ రాయితీ ఎత్తేశారు. వారు పదవీ విరమణ పొందే వరకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. అంటే అంగన్‌వాడీ పోస్టు కావాలా? సంక్షేమ పథకాలు కావాలా? అనే పరిస్థితిని వారికి కల్పించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అంగన్‌వాడీ కార్యకర్తలకు 10వేల 500 వేతనం అందేది. జగన్‌ పెంచింది వెయ్యి రూపాయలు. ఈ మొత్తాన్ని ఏడాదికి లెక్కేస్తే వారికి అదనంగా అందేది 12 వేలు. అదే ఒక్క దివ్యాంగ పింఛను నెలకు 3 వేలు తీసేయడంతో ఏడాదికి 36 వేలు నష్టపోయారు. ఇంటి నిర్మాణ రాయితీ వర్తించక లక్ష యాభై వేలు అందలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో లక్షల్లో కోల్పోయారు. ఇక విద్యాదీవెన, వసతి దీవెన అందక పిల్లల భవిష్యత్తే ఇబ్బందుల్లో పడింది.

ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం: అంగన్వాడీలు

ABOUT THE AUTHOR

...view details