Vinesh Phogat Olympics 2024:భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అదరగొట్టింది. శనివారం జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో సత్తాచాటిన వినేశ్ ఫొగాట్ (50 కేజీలు) వరుసగా మూడోసారి ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్ పోటీల్లో వినేశ్ వరుసగా మిరాన్ చియాన్ (కొరియా), స్మానంగ్ (కంబోడియా)పై పైచేయి సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో వినేశ్, 19ఏళ్ల లారా గనికిజీ (కజకిస్థాన్)తో తలపడింది. ఇక్కడ ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా, అనుభవంతో పోరాడి 4- 0 ఆధిక్యంతో వినేశ్ గెలుపును సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో వినేశ్ ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరింది. కాగా, 2016 రియో, 2020 టోక్యో ఒలిపింక్స్‌లో వినేశ్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇక ఇదే విభాగంలో మరో ఇద్దరు రెజ్లర్లు అన్షు మాలిక్, అండర్-23 ప్రపంచ ఛాంపియన్ రీతిక సత్తా చాటారు. సెమీస్‌లో అన్షు 11-0తో లేలోకోన్ సోబిరోవా (ఉజ్బెకిస్థాన్)ను, రితిక తన ప్రత్యర్థి చాంగ్ (చైనీస్ తైపీ)పై 7-0తో నెగ్గి ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఇక మరో రెజ్లర్ అంతిమ్ పంఘాల్ (57 కేజీలు) కూడా ఇదే విభాగంలో గతేడాదే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యింది. దీంతో మహిళల రెజ్లర్లు నాలుగు కోటా స్థానాలు సాధించినట్లైంది.
అన్నింటికీ సమాధానం: 2022 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి గెలిచిన తర్వాత మ్యాట్‌పై, బయట వినేశ్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య అప్పటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా పోరాడింది. రోడ్డుపైనే నిద్రించింది కూడా. ఈ క్రమంలో వినేశ్ చాలా కాలం ప్రాక్టీస్‌కు సైతం దురమైంది.