ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లక్షలాదిగా ఓటర్ల తొలగింపు - అంతు చిక్కని సందేహాలెన్నో!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 8:47 AM IST

Votes Removed in Andhra Pradesh : ప్రతిపౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘం ఊహకందని రీతిలో ఓట్లను తొలగించడంపై పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్లు తొలగింపుపై, దొంగ ఓట్ల చేర్పులపై అనేక ఫిర్యాదులున్నా, వాటిని ఎన్నికల సంఘం పట్టించుకోలేదనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

votes_removed_in_andhra_pradesh
votes_removed_in_andhra_pradesh

లక్షలాదిగా ఓటర్ల తొలగింపు - అంతు చిక్కని సందేహాలెన్నో!

Votes Removed in Andhra Pradesh: ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాల్సిన ఎన్నికల సంఘం అసాధారణ స్థాయిలో ఓట్లు తొలగించడంపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముసాయిదా జాబితాలో అక్రమాలు, అవకతవకలపై అనేక ఫిర్యాదులు చేసినా ఈసీ తూతూమంత్రపు చర్యలతో తుదిజాబితా విడుదల చేసిందని విమర్శిస్తున్నాయి. ఏడాది కాలంలో ఏకంగా 30 లక్షల ఓట్లు తీసేయడం అసాధారణమని ఆక్షేపిస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన తుది ఓటరు జాబితాపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2023 జనవరి 6 నుంచి 2024 జనవరి 22 మధ్య ఏడాది వ్యవధిలో 30 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించారు. వాటిల్లో దాదాపు సగం అంటే 14లక్షల 26 వేల ఓట్లు వలస వెళ్లారనే సాకుతో తీసేయటంపై అనుమానాలు నెలకొన్నాయి. వలసల పేరిట ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లు తీసేశారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వలసల పేరుతో తొలగించడంపై అనుమానాలు : సాధారణంగా ఓట్ల తొలగింపు జాబితాలో మృతులు, ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉండటం వంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకు విరుద్ధంగా వలసల పేరిట అసాధారణ స్థాయిలో ఓట్లు తీసేయటం, అది కూడా మరో 2, 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో తొలగించటంపై అనుమానాలు నెలకొన్నాయి.

ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు

ఓట్లన్ని వలసదారులవేనా అంటే సమాధానం లేదు : 2022 జనవరి 6 నుంచి 2023 జనవరి 5 మధ్య అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 11,23,829 ఓట్లు తొలగించగా, అందులో వలసల పేరిట ఒకల లక్ష 11 వేల 578 ఓట్లు తొలగించారు. ఐతే ప్రస్తుతం ఒక్క వలసల పేరుతోనే 14.26 లక్షల ఓట్లు తొలగించారు. ఏడాదిలో అన్ని విభాగాల్లో కలిపి తీసేసిన మొత్తం ఓట్లలో ఇది 47.53 శాతం. నిజంగానే ఆ తొలగించిన ఓట్లన్నీ వలస వెళ్లినవారివేనా. అర్హులవీ ఉన్నాయా. అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు.

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్​సీపీ నేరపూరిత కుట్ర : తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు తప్పుడు వివరాలతో ఫాం-7 దరఖాస్తులు పెట్టే నేరపూరిత కుట్రను వైఎస్సార్​సీపీ రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థీకృతం చేసింది. ఈ దరఖాస్తుల ఆధారంగా సమగ్ర విచారణ లేకుండానే ఓట్లు తొలగించేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులిస్తూనే ఉన్నాయి.

పర్చూరులో పెద్ద ఎత్తున :తప్పుడు సమాచారంతో ఫాం-7 దరఖాస్తులు పెట్టి ప్రతిపక్షాలకు మద్దతిచ్చేవారి ఓట్లు తొలగించే నేరపూరిత కుట్ర పర్చూరు నియోజకవర్గంలో పెద్దఎత్తున అమలైంది. అక్కడ ఏకంగా 13 వేల 588 ఓట్లు తొలగించేశారు. ఓటరు జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే సదరు వ్యక్తికి లేదా వారి కుటుంబసభ్యులకు అధికారులు ముందస్తు నోటీసునివ్వాలి. వారిని విచారించి సమాధానం సహేతుకంగా లేకపోతేనే తొలగించాలి.

ఓట్ల తొలగింపులో వైఎస్సార్​సీపీ నేతల కుట్ర - పట్టనట్లుగా ఎన్నికల సంఘం

సమాచారమివ్వకుండా తొలగించారని ఫిర్యాదులు : అధికార వైఎస్సార్​సీపీ నాయకులు, వాలంటీర్లు, కొంతమంది బీఎల్వోలు కుమ్మక్కై అనేక నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల మద్దతుదారులకు చెందిన ఓటర్లకు నోటీసులు ఇవ్వకుండా, వారికి తెలియకుండానే ఓట్లు తొలగించేశారనే ఫిర్యాదులున్నాయి. ప్రధానంగా విద్య, ఉపాధి కోసం తాత్కాలికంగా వివిధ ప్రాంతాలకు వలసవెళ్లి స్వగ్రామాలకు తిరిగొచ్చేవారిని గుర్తించి ఓట్లు తీసేయించారు.

మారని ఎన్నికల సంఘం తీరు :ముసాయిదా జాబితాలో అక్రమాలు, లోపాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు తరచూ అభ్యంతరాలు తెలిపినా ఎన్నికల సంఘం తీరు మారలేదు. వలస వెళ్లారనే పేరుతో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించిన ఎన్నికల సంఘం తుది జాబితాలోనూ ఆ తప్పులను సరిదిద్దలేదు. ఏ నియోజకవర్గ ఓటరు జాబితాలో చూసినా మృతుల పేర్లు కనిపిస్తూనే ఉన్నాయి. అన్ని రకాలుగా ఓటుకు అర్హులై ఉండి, దరఖాస్తు చేసుకున్న వారికి ఓటరు జాబితాలో పేరు లేదు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో అర్హుల ఓట్లు తొలగించి, అసలు ఉనికిలో లేని వ్యక్తుల పేర్లు తుది జాబితాలో చేర్చారు.

ఓట్ల అవకతవకలపై అధికార పార్టీపై ఫిర్యాదు చేసిన విపక్షాలు- విపక్షాలపై ఫిర్యాదు చేసిన అధికార పక్షం

ఆబ్సెంటీ ఓట్లను కొనసాగించారు: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైఎస్సార్​సీపీ నేతల ఓట్ల అక్రమాలకు సహకరించారంటూ అధికారి గిరీషాను సస్పెండ్‌ చేసిన ఎన్నికల సంఘం, ఆ ఎన్నిక జరిగిన రెండున్నరేళ్ల తర్వాత కూడా ఆబ్సెంటీ ఓట్లను జాబితా నుంచి తొలగించలేదు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో మొత్తం 38 వేల 396 మంది ఓటర్లు ఆయా చిరునామాల్లో లేకుండా శాశ్వతంగా వెళ్లిపోయినట్లు తేలింది. వీటిపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా తాజాగా విడుదలైన తుది జాబితాలోనూ ఈ ఆబ్సెంటీ ఓట్లలో చాలావరకూ యథాతథంగా కొనసాగించారు.

ఓట్ల నమోదుపై అనుమానాలు : పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో గడిచిన ఐదేళ్లలో 65 వేల 999 మంది ఓటర్లు పెరిగారు. సంవత్సరంలో వెయ్యి మంది పెరిగితే, ఐదు సంవత్సరాల్లో ఐదు వేలకు అటు ఇటుగా పెరగాలి. అందుకు భిన్నంగా భారీగా నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలకు అధికార పార్టీ తెరలేపిన వైనం తాజాగా వెలుగు చూసింది. టెక్కలి వైఎస్సార్​సీపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన దువ్వాడ వాణి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన చింతాడ సాయికుమార్‌తోపాటు మరో ముగ్గురు వైఎస్సార్​సీపీ నాయకులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

అర్హుల ఓట్ల తొలగింపునకు నకిలీ ఫాం-7లు పెట్టారంటూ వీరందరిపైనా కోటబొమ్మాళి, నందిగాం పోలీసుస్టేషన్లలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన తుది జాబితా ప్రకారం టెక్కలి నియోజకవర్గంలో మొత్తం 7,107 ఓట్లు తొలగించారు. వీటిల్లో నకిలీ ఫాం-7ల ఆధారంగా ఎన్ని ఓట్లు తీసేశారో తేలాల్సి ఉంది.

ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కావడం లేదు - ఓటర్ల జాబితాలో అక్రమాలు : ఎంపీ గల్లా జయదేవ్‌

ABOUT THE AUTHOR

...view details