Nara Lokesh Shankharavam Meeting at Pathapatnam: జగన్ చెప్పేవన్నీ అసత్యాలే అని, రోజుకు ఒక మోసం, అబద్ధం చెప్పడమే పని అయిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఎన్నికల ముందు జగన్ తియ్యగా మాటలు చెప్పారని, ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోయారని మండిపడ్డారు. ఏటా డీఎస్సీ అని చెప్పిన జగన్, నాలుగున్నరేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగించారు.
నిరుద్యోగులు అధైర్యపడవద్దు:వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు మూసేశారని, విదేశీ విద్య కూడా ఆపేశారని అన్నారు. ఏటా కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీ అన్నారు అని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దన్న లోకేశ్, రెండు నెలలు ఓపిక పట్టండని తెలిపారు.
వైసీపీకి అంతిమ'యాత్ర'గా మారిపోయింది:కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి యాత్ర-2 సినిమా తీశారని కానీ అది కాస్తా వైసీపీకి అంతిమయాత్రగా మారిపోయిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. డబ్బులిచ్చి సినిమాకు పొమ్మన్నా ఎవరూ వెళ్లట్లేదని అన్నారు. అర్జునుడు, అభిమన్యుడు అని జగన్ చెబుతుంటారని, నిజానికి జగన్ ఒక సైకో, భష్మాసురుడు అని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యేల బదిలీలతోనే ఓటమిని ఒప్పుకున్నారు- దిల్లీలో కూడా బైబై జగన్ అంటున్నారు: నారా లోకేశ్
బాంబులకే భయపడని కుటుంబం మాది:ఈమధ్య జగన్ ప్రసంగాలలో మీ బిడ్డ, మీ బిడ్డ అంటున్నారని జాలిపడవద్దన్న లోకేశ్, పొరపాటున ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా మీ భూమి తీసుకుంటానంటారని విమర్శించారు. జగన్ అంటే జైలు, బాబు అంటే ఒక బ్రాండ్ అని లోకేశ్ తెలిపారు. జగన్‌ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుందని, చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తుందని అన్నారు. జగన్‌ను చూస్తే ప్రిజనరీ కనిపిస్తే, బాబును చూస్తే విజనరీ కనిపిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే కార్యకర్తలు భయపడతారని అనుకున్నారని, కేసులకు భయపడేది లేదని జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బాంబులకే భయపడని కుటుంబం తమదన్న లోకేశ్, పనికిమాలిన కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు.