BSP 2 MP Seats in Telangana 2024 :లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు ఎంపీ స్థానాలను కేటాయించారు. ఇరు పార్టీల నేతల చర్చల అనంతరం పొత్తుపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. ఈ మేరకు బీఎస్పీకి రెండు స్థానాలను కేటాయించినట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు బరిలో దిగనున్నారో తెలియాల్సి ఉంది. పార్టీ పోటీ చేసే రెండు స్థానాల్లో అభ్యర్థులను బీఎస్పీ త్వరలోనే ఖరారు చేయనుంది.
మా పొత్తు చారిత్రాత్మక అవసరం : భారత్ రాష్ట్ర సమితి - బహుజన సమాజ్ పార్టీలు అన్ని లోక్‌సభ స్థానాల్లో పూర్తి పరస్పర సహకారంతో, విజయం దిశగా పయనించబోతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీఎస్‌స్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన ఈ పొత్తు నిర్ణయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణ కోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతుందని ఆర్‌ఎస్‌పీ ధీమా వ్యక్తం చేశారు.
RS Praveen Kumar Nagar Kurnool MP Seat :భారతి రాష్ట్ర సమితి-బహుజన సమాజ్ పార్టీల పొత్తుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగనున్నారని ఆయన వెల్లడించారు. ఆర్‌ఎస్‌పీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్తో పొత్తు - వారంతా మా కూటమిని నిందించడం హాస్యాస్పదం'