Tollywood 2024 Box Office First Three Months : సర్కారు నౌకరి అనే చిన్న సినిమాతో కొత్త ఏడాదిని స్వాగతించింది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. జనవరి 1న రిలీజైన ఈ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత ప్రేమకథ, రాఘవ రెడ్డి, డబుల్ ఇంజిన్ ఇలా చాలానే సినిమాలు వచ్చి ఫెయిల్ అయ్యాయి. అనంతరం సంక్రాంతి బరిలో జనవరి 12న మహేశ్‌బాబు గుంటూరు కారం, తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ హను-మాన్, 13న వెంకటేశ్ సైంధవ్, 14న నాగార్జున నా సామి రంగ వచ్చాయి. వీటిలో హనుమాన్ అతి తక్కువ బడ్జెట్(రూ.30 కోట్ల లోపు) అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లకు వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. గుంటూరు కారం, సైంధవ్ నిరాశపరచగా నా సామిరంగ మంచి హిట్ అందుకుంది. ఇక నెలాఖరులో రిపబ్లిక్ డేన ధనుశ్ కెప్టెన్ మిల్లర్ వచ్చి పర్వాలేదనిపించింది. అప్పుడే రావాల్సిన అయలాన్ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.
ఫిబ్రవరి పర్వాలేదు - సాధారణంగా ఫిబ్రవరి అంటే అన్‌సీజన్. విద్యార్థులకు పరీక్షల సీజన్. అందుకే పెద్ద చిత్రాలు రావు. కానీ ఈ మధ్య ఆ ట్రెండ్ మారుతోంది. భీమ్లా నాయక్, ఉప్పెన, జాంబిరెడ్డి, నాంది ఇలా చాలా సినిమాలు గత రెండేళ్లలో ఫిబ్రవరిలో హిట్ కొట్టాయి. అయితే ఈ ఏడాది అలా జరగలేదు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు, కిస్మత్, హ్యాపీ ఎండింగ్, బూట్‌కట్ బాలరాజు చాలానే సినిమాలు రాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఒక్కటే పర్వాలేదనిపించింది.
ఫిబ్రవరి రెండో వారంలో రవితేజ ఈగల్‌తో పాటు రజనీకాంత్ లాల్ సలాం వచ్చాయి. ఈగల్ యావరేజ్‌గా ఆడగా లాల్ సలామ్ డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన వచ్చి టాక్ పర్వాలేదనిపించినా వసూళ్లు రాలేదు. మూడో వారంలో మమ్ముట్టి భ్రమయుగంతో పాటు మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా, రాజధాని ఫైల్స్, సిద్ధార్థ్ రాయ్ సహా పలు సినిమాలు వచ్చాయి. వీటిలో భ్రమయుగం ఒక్కటే సక్సెస్.