Ranveer Singh Kriti Sanon:బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్, కృతి సనన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆదివారం వారణాసిలో సందడి చేశారు. ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ వారణాసిలో ఉండే చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొనేముందు కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లారు. కృతి పసుపు రంగు కుర్తా-పైజామాలో,రణ్‌వీర్ తెల్లటి కుర్తాలో, మనీష్ గులాబీ తెలుపు రంగులో ఉన్న కుర్తాలో ముందుగా దశాశ్వమేధ ఘాట్‌కు వెళ్లారు.
అక్కడ ఉన్న అభిమానులతో ముచ్చటించారు. అక్కడ మీడియాతో మాట్లాడిన రణవీర్ తను శివ భక్తుడిని మొదటి సారి ఇక్కడికి వచ్చానని వచ్చేసారి తన తల్లితో కలిసి రావాలనుందని చెప్పాడు. కృతి కూడా మీడియాతో మాట్లాడింది. తను పదేళ్ల క్రితం యాడ్ షూట్ కోసం ఇక్కడికి వచ్చానని కానీ, అప్పుడు ఆలయానికి రావడానికి టైం కుదరలేదని ఇప్పుడు అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. వారణాసిలోని చేనేత మరియు హస్తకళలను ప్రోత్సహించేందుకు ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం మనీష్ ఫ్యాషన్ షో నమో ఘాట్‌లో జరిగింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పర్యవేక్షణలో 22 మంది నేత కార్మికులతో చేసిన బనారసీ సిల్క్ దుస్తులను ప్రమోట్ చేయడానికి రణవీర్ కృతి షోస్టాపర్‌లుగా మారారు. రణవీర్ మెటాలిక్, డార్క్ కలర్ షేర్వానీని వేసుకుంటే కృతి బ్రైడల్ రెడ్ లెహంగాలో ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఇద్దరితో పాటు దేశంలోని 40 మంది ప్రముఖ మోడల్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. శ్రీలంక, జింబాబ్వే, ఉగాండా, మాలి, టోగో, పెరూ, పనామాతో పాటు మొత్తం 20 దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.