Family Star Dilraju :టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలిక్యులేటెడ్ ప్రొడ్యూసర్స్ తక్కువ. అంత క్లారిటీగా ఉన్న వాళ్లే సక్సెస్‌ను చూడగలుగుతారు. అలాంటి వారిలో దిల్ రాజు ఒకరు. ఒక సినిమాను చూసి దానికెంత మార్కెట్ వస్తుందో ముందే అంచనా వేయగల సత్తా ఆయనలో ఉంటుందని చాలా మంది అంటుంటారు. తాజాగా ఆయన నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తానెప్పుడూ డబ్బుల కోసం పనిచేయలేదని, సక్సెస్‌ఫుల్ స్టోరీల కోసమే ప్రయత్నించానని తన మనసులోని మాట బయటపెట్టారు. సినిమాలను తాను ముందే అంచనా వేస్తానని, 90శాతం తాను అనుకున్నట్లే జరుగుతాయని తెలిపారు దిల్‌రాజ్. కానీ, మిగిలినది మన చేతిలో ఉండదని అన్నారు.
ఒక సినిమా బడ్జెట్ పెరుగుతుందంటే, అందులో సగం హీరో రెమ్యూనరేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. వాళ్లని తగ్గించుకోమని చెబితే సరిపోతుందేమోనని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. "మహేశ్‌ను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పా. వెంకటేశ్ కూడా దానికి ఒప్పుకున్నారు. అలా అన్ని సార్లు కుదరదు. కథ అక్కడ డిమాండ్ చేయడంతో వాళ్లు కూడా ఓకే అనేశారు. హీరో రెమ్యూనరేషన్ ఆధారంగానే స్టోరీకి గ్రాండ్ నెస్ పెరుగుతుంది. అలా రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పలేం" అని బదులిచ్చారు.