Paytm Shares Climb :పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై (PPBL) ఆర్‌బీఐ విధించిన ఆంక్షల వ్యవహారంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని కేంద్రం స్పష్టం చేసింది. మంగళవారం పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆమె స్పష్టం చేసిందని విశ్వసనీయ సమాచారం.
కేవలం 10 నిమిషాలే
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ల మధ్య జరిగిన భేటీ కేవలం 10 నిమిషాల్లో ముగిసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పేటీఎంపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షల ఈ వ్యవహారంలో కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదని ఆర్థికమంత్రి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు నేరుగా ఆర్‌బీఐతోనే చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఆర్బీఐతోనూ చర్చలు
విజయ్ శేఖర్ శర్మ తమ సంస్థపై విధించిన రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు ఆర్‌బీఐ అధికారులతోనూ సమావేశమైనట్లు సమాచారం తెలుస్తోంది.
లాభాల్లోకి షేర్లు
Paytm Shares Today :పేటీఎం ఫిబ్రవరి 29 తర్వాత ఖాతాదారులు నుంచి డిపాజిట్లు స్వీకరించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అలాగే కస్టమర్లు ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్-అప్‌లు చేయకూడదని స్పష్టం చేసింది. పేటీఎం బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించడం వల్లే ఈ ఆదేశాలు జారీ చేశామని ఆర్‌బీఐ పేర్కొంది.