Ram Navami Naivedyam Making Process :జగదభిరాముడి కల్యాణ వేడుక 'శ్రీరామనవమి'(Sri Rama Navami 2024)కి సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవం కోసం దేశంలోని రామభక్తులంతా ఏర్పాట్లు పూర్తి చేశారు. కోదండరాముడి కల్యాణాన్ని కళ్లారా చూసి తరించేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ శుభవేళ శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. వంటివి నైవేద్యంగా సమర్పించి.. ఆ తర్వాత వీటిని ప్రసాదంగా పంచిపెడతారు. మరి.. ఈ పానకం, వడపప్పు ఎలా తయారు చేయాలో తెలుసా?
పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు :
- బెల్లం తరుగు - అరకప్పు
- నీళ్లు - రెండు కప్పులు
- మిరియాలపొడి - పావు చెంచా
- శొంఠిపొడి - పావుచెంచా
- యాలకులపొడి - అరచెంచా
- ఉప్పు - చిటికెడు
- నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు
- పచ్చకర్పూరం - చిటికెడు
- తులసి ఆకులు - ఐదారు
పానకం తయారీ విధానం :
- ముందుగా ఓ గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బెల్లం తరుగు వేసుకొని పెట్టుకోవాలి.
- బెల్లం పూర్తిగా కరిగిందనుకున్నాక వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఆ మిశ్రమంలో మిరియాల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- అలాగే ఉప్పు, పచ్చకర్పూరం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత పానకాన్ని గ్లాసుల్లో పోశాక తులసి ఆకులు, కావాలంటే రెండు ఐస్‌ముక్కలు వేసుకుంటే సరి.
- అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తియ్యతియ్యటి బెల్లం పానకం రెడీ..!
ఆరోగ్య ప్రయోజనాలు :
- పానకంలో వేసే బెల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు, శొంఠి... అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. కాబట్టి వేసవిలో వచ్చే శ్రీ రామనవమి పర్వదినాన ఈ పానకం తీసుకుంటే వేసవి తాపాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- అంతేకాకుండా.. బెల్లంలో ఐరన్, పొటాషియం, భాస్వరం తదితరాలు ఉన్నందున వెంటనే శక్తి లభిస్తుందని, రక్తహీనత బారిన పడనివ్వకుండా కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.
- అలాగే రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా.. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు. ఎసిడిటీ, జీర్ణసమస్యలూ దూరమవుతాయి. నెలసరి సమస్యలను తగ్గిస్తుంది.
- ముఖ్యంగా ఎండలకు చిన్నారులు త్వరగా అలసిపోతుంటారు. ఆ నీరసం పానకంతో తగ్గుతుంది.
- అలాగే మిరియాలు, తులసి ఆకుల్లో దగ్గు, కఫం తగ్గించే ఔషధ గుణాలుంటాయి.
- శొంఠిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆకలిని పెంచుతాయి, రోగనిరోధక శక్తినిస్తాయని చెబుతున్నారు నిపుణులు.