ETV Bharat / sukhibhava

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సలో.. బుల్లి రోబో!

author img

By

Published : Mar 26, 2022, 12:51 PM IST

Robot for Lung Cancer: ఊపిరితిత్తులు, శ్వాస నాళాల్లో తలెత్తిన సమస్యలను పరీక్షించడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు వినూత్న రోబోను తయారు చేశారు. కేవలం 2 మిల్లీమీటర్లు ఉండే ఈ రోబో.. సూక్ష్మాతిసూక్ష్మమైన శరీర భాగాల చికిత్సలో ఉపయోగపడుతుంది. అయితే.. ఈ రోబో పనితీరు, ఉపయోగాలు తదితర విషయాల గురించి తెలుసుకోండి.

Robotic Surgery for Lung Cancer
మ్యాగ్నెటిక్‌ టెంటకిల్‌ రోబో

Robot for Lung Cancer: ఊపిరితిత్తుల్లో.. మొక్క వేళ్ల తరహాలో భిన్న దిశల్లో ఉండే సన్నటి శ్వాసనాళాల్లోకి సులువుగా ప్రవేశించే ఒక బుల్లి రోబోను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇరుకైన ఆ భాగాల నుంచి కణజాల నమూనాలు తీసుకోవడానికి ఇది సాయపడుతుంది. ఔషధాలనూ చేరవేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఆ అవయవానికి సంబంధించిన ఇతర వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఇది అద్భుతంగా సాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఏమిటీ సాధనం?

Robotic Surgery for Lung Cancer
మ్యాగ్నెటిక్‌ టెంటకిల్‌ రోబో

ఈ సాధనానికి 'మ్యాగ్నెటిక్‌ టెంటకిల్‌ రోబో' అని పేరు పెట్టారు. దీని వ్యాసం 2 మిల్లీమీటర్లు. అంటే.. బాల్‌పాయింట్‌ పెన్ను మొనకు రెట్టింపు పరిమాణంలో ఇది ఉంటుంది. బ్రిటన్‌లోని లీడ్స్‌ సెంటర్‌ ఫర్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌కి అనుబంధంగా ఉన్న స్టార్మ్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు.

ప్రయోగం సక్సెస్‌

శ్వాసకోశ వ్యవస్థ త్రీడీ నమూనాపై ఈ విధానాన్ని విజయవంతంగా పరీక్షించారు. తదుపరి దశలో.. మృతదేహం నుంచి సేకరించిన ఊపిరితిత్తుల్లోకి ఈ సాధనాన్ని ప్రయోగాత్మకంగా పంపి, దాని సమర్థతను పరిశీలిస్తారు.

పాత పరిజ్ఞానంలో ఇబ్బందులు

ప్రస్తుతం ఊపిరితిత్తులు, శ్వాస నాళాలను పరీక్షించడానికి వైద్యులు బ్రాంకోస్కోపు అనే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 4 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఈ సాధనాన్ని ముక్కు లేదా నోటి ద్వారా శ్వాస మార్గంలోకి పంపిస్తారు. అయితే పరిమాణం రీత్యా.. శ్వాసకోశ వ్యవస్థలోని ఎగువ భాగంలోకి మాత్రమే అది వెళ్లగలుగుతోంది. మరింత దిగువకు దీన్ని ప్రవేశపెట్టడానికి వైద్యులు 2 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కెథెటర్‌ను ఉపయోగిస్తున్నారు. దాన్ని బ్రాంకోస్కోపు గుండా ఊపిరితిత్తుల్లోని చిన్నపాటి గొట్టాల్లోకి ప్రవేశపెడుతున్నారు. అయితే బ్రాంకోస్కోపును అటూఇటూ కదిలిస్తూ, అవసరమైన చోటుకు ఈ పరికరాన్ని, కెథెటర్‌ను పంపడం వైద్యులకు కష్టమవుతోంది. ఈ క్రమంలో ఎక్స్‌రేలను వాడాల్సి వస్తోంది.

అక్కరకొచ్చిన రోబో

బ్రాంకోస్కోపుతో ఎదురవుతున్న ఇబ్బందులను మ్యాగ్నెటిక్‌ టెంటకిల్‌ రోబో అధిగమిస్తుంది. దీన్ని సులువుగా ఎక్కడికైనా పంపొచ్చు. ఈ సాధనాన్ని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు రెండు ప్రధాన సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. మొదటిది.. ఇది చిన్నగా ఉండి, ఎటుపడితే అటు వంగేలా ఉండటం. దీంతో శ్వాసకోశ వ్యవస్థలోని మెలికలు, మలుపుల గుండా ఇది సులువుగా కదిలేలా చేశారు. ఇక రెండోది.. నిర్దేశిత ప్రాంతానికి దీన్ని చేర్చడం. ఇందుకోసం.. మాన్యువల్‌గా గైడ్‌ చేసే విధానానికి బదులు స్వయంప్రతిపత్తితో కూడిన మార్గనిర్దేశ వ్యవస్థను పరిశోధకులు అభివృద్ధి చేశారు.

80 మిల్లీమీటర్ల పొడవు, 2 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన గొట్టాలను గుదిగుచ్చి ఈ సాధనాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇందుకోసం మృదువైన ఎలాస్టోమెట్రిక్‌ పదార్థాన్ని వాడారు. ఫలితంగా ఇది సులువుగా ఎటుపడితే అటు వంగుతుంది. ఇందులో చిన్నపాటి అయస్కాంత రేణువులను ఉంచారు.

అయస్కాంతంతో దిశానిర్దేశం

Robotic Surgery for Lung Cancer
అయస్కాంతంతో పనిచేసే రోబో

రోగి ఊపిరితిత్తులకు అంతకుముందు నిర్వహించిన స్కాన్‌ల ఆధారంగా శ్వాస వ్యవస్థలో ఈ రోబో సాధనం ప్రయాణించాల్సిన మార్గాన్ని నిర్ణయిస్తారు. దాన్ని ఒక రోబోటిక్‌ వ్యవస్థలోకి ప్రోగ్రామ్‌ చేస్తారు. దీనికి అనుగుణంగా శరీరం వెలుపల అయస్కాంతాలు కదులుతూ.. 'మ్యాగ్నెటిక్‌ టెంటకిల్‌ రోబో'లోని అయస్కాంత రేణువులను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో అవసరాన్ని బట్టి ఈ పరికరం తన ఆకృతి, దిశను మార్చుకుంటూ శ్వాసనాళాల్లోని మెలికల గుండా సులువుగా ముందుకు సాగుతుంది. ఈ విధానాన్ని నిర్వహించేటప్పుడు రోగులకు ఎక్స్‌రే నిర్వహించాల్సిన అవసరం ఉండదు. వ్యక్తులకు అనుగుణంగా దీన్ని ప్రత్యేకంగా నిర్వహించొచ్చు.

ఇదీ చదవండి: చిన్న వయసులోనే పక్షవాతానికి.. అధిక బరువు కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.