ETV Bharat / sukhibhava

పప్పులతో పండంటి ఆరోగ్యం.. ఇంకెందుకు ఆలస్యం తినేయండి మరి..

author img

By

Published : Feb 27, 2023, 8:00 AM IST

సాధారణంగా మన బంధువులు కలిసినప్పుడు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్​రా అని అడుగుతుంటారు. అయితే దీని అర్థం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు​ అని పరోక్షంగా అడుగుతారు. అయితే ఈ నానుడి ఎందుకు, ఎలా వచ్చిందో తెలీదు కానీ.. ఆ పప్పుల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా మీ ఆహారంలో పప్పు ఉండేలా చూసుకుంటారు. అంతలా ఇవి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. మరి ఈ చిరుధాన్యాలు మన శరీరానికి అందించే పోషక విలువలు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Extraordinary Benefits Of Pulses In Telugu
చిరుధాన్యాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుగులో

ముఖ్యంగా తెలుగు వాళ్ల ఇళ్లలో భోజనం చేసేటప్పుడు పప్పుతో చేసిన కూర లేకపోతే తిన్నట్లు అనిపించదు. ఏదో ఒక రకమైన పప్పును, ఏదో ఒక కాయగూరతోనో లేదంటే ఆకుకూరలతోనో కలిపి వండి ఇష్టంగా తినడం మనకు అలవాటు. అయితే కొందరు మాత్రం మళ్లీ పప్పేనా అంటూ కుటుంబ సభ్యులను విసుక్కుంటూ ఉంటారు. పప్పుల్లో ఉండే పోషకాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం దానిని అస్సలు మరిచిపోరని వైద్యులు చెబుతుంటారు.

టమాట పప్పు, మామిడికాయ పప్పు, పాలకూర పప్పు, తోటకూర పప్పు, మెంతికూర పప్పు.. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రకాల పప్పులతో చేసే జాబితా చాలా పెద్దదే అవుతుంది. తెలుగు వాళ్లు పప్పులను ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటారు. అయితే పప్పు అంటే కాస్త అయిష్టంగా ఉండే వాళ్లు మాత్రం దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ పప్పు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, పప్పును కచ్చితంగా ఆహారంలో ఒక భాగం చేసుకొని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి అంతలా మేలు చేసే పోషకాలు పప్పుల్లో ఏమున్నాయో డాక్టర్లు వివరిస్తున్నారు.

ఆహారంలో సాధారణంగా తీసుకునే పప్పు దినుసులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పు దినుసులైన కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, బఠాణీ వంటి వాటిల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. దీని వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే వీటిలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. పప్పుల ద్వారా సోడియం కూడా శరీరానికి తక్కువగా అందుతుంది. దీని వల్ల రక్తపోటు ప్రమాదాన్ని నివారించవచ్చు.

దాదాపు అన్ని రకాల 100 గ్రాముల మోతాదు పప్పుల ద్వారా సుమారు 25 గ్రాముల ప్రోటీన్లు అందితే, వాటిని ఉడికించిన తర్వాత కనీసం 8 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. అయితే వీటిని బియ్యం లేదంటే కొర్రలతో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. పప్పులను తీసుకోవడం ద్వారా శరీరానికి ఐరన్​ బాగా అందుతుంది. ఫలితంగా రక్తలేమి సమస్యను అధిగమించవచ్చు.

"వివిధ రకాల పప్పులను తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు తగిన మోతాదులో అందుతాయి. ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నా పప్పును ఆహారంలో చేర్చుకోవచ్చు. ఆరు నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా పప్పును తినవచ్చు. 100 గ్రాముల పప్పులో 320 గ్రాముల క్యాలరీల నుంచి 340 గ్రాముల క్యాలరీల వరకు శక్తి, 19 గ్రాముల ప్రోటీన్లు, 6 గ్రాముల ఫ్యాట్, బి-కాంప్లెక్స్ విటమిన్లు లభిస్తాయి. పప్పుల ద్వారా అందే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో పేగులు, కండరాలకు ఎంతో మేలు చేకూరుతుంది. పప్పులు తినడం వల్ల రక్తంలో ప్రోటీన్ల శాతం పెరుగుతుంది. సోయాబీన్స్ తీసుకోవడం వల్ల కూడా శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. పప్పుల్లో కొవ్వు శాతం తక్కువ ఉన్నా అది కూడా ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఉంటుంది. 100గ్రాముల సోయాబీన్స్ తీసుకుంటే శరీరానికి 33గ్రాముల ప్రోటీన్లు, 400గ్రాముల క్యాలరీలు, 10గ్రాముల ఫ్యాట్, 10గ్రాముల ఐరన్ పోషకాలు అందుతాయి. మినపపప్పు తీసుకోవడం వల్ల గ్యాస్​ను నివారించే శక్తి శరీరానికి అందుతుంది. అలాగే తిన్న ఆహారం తేలికగానూ జీర్ణమవుతుంది. మినపపప్పును కూరలు, దోసెలు, ఇడ్లీలు, వడల రూపంలో తీసుకోవచ్చు. అనేక రకాల పప్పులను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి వండుకొని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది."

- డా. శ్రీలత, డైటీషియన్

పప్పుల ద్వారా శరీరానికి పొటాషియం అందుతుంది. దీని వల్ల గుండెకు లాభం చేకూరుతుంది. అలాగే పీచు పదార్థాలు శరీరానికి అందించడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అటు పప్పుల ద్వారా అందే విటమిన్- బి వల్ల నరాలు కూడా బలపడతాయి. గర్భవతులకు అవసరమయ్యే ఫోలెట్ విటమిన్​ కూడా పప్పులు తినడం ద్వారా లభిస్తుంది. తక్కువ ఖర్చులో అన్ని రకాల పోషకాలు అందించే పప్పును తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

పప్పులో గ్లైసమిక్స్ ఇండెక్స్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. అంటే పరోక్షంగా షుగర్ పేషంట్లకు పప్పులు మేలు చేస్తాయి. కంది, మినుము పప్పులను తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నివారణ సాధ్యం అవుతోందని పరిశోధనల్లో తేలింది. అలాగే చర్మం ఆరోగ్యంతో పాటు కాంతివంతంగా కనిపించటంలో పప్పులు కీలక పాత్ర పోషిస్తాయి.

చిరుధాన్యాల వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.