ETV Bharat / sukhibhava

కరోనా కాలంలో చేయాల్సినవి.. చేయకూడనివి..

author img

By

Published : Apr 30, 2021, 3:18 PM IST

దేశంలో రెండో దశ కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఈ తరుణంలో చాలామందిలో వ్యాధి కంటే భయం, ఆందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. కరోనా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పనులు చేయకూడదు? లాంటి వివరాలను తెలుసుకుందాం..

Sanitizer, Mask
శానిటైజర్​, మాస్క్​

రెండో విడతలో కొవిడ్​ విరుచుకుపడుతోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్‌ సోకితే మిగతా వారికీ సులభంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో చాలామందిలో ఎన్నో భయాలు, ఆందోళనలు నెలకొంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారంతో కరోనాపై రకరకాల అపోహలు వెంటాడుతున్నాయి. ఎలాంటి మాస్క్‌ ధరించాలి? టీకా తీసుకున్నా పాజిటివ్‌ వస్తుందా? కొవిడ్‌ రోగులు వ్యాయామం చేయవచ్చా? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? తదితర అంశాలపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు. ఈ నేపథ్యంలో 'ఈనాడు' పలువురు వైద్య నిపుణులను సంప్రదించగా.. వారు అందించిన విలువైన సూచనలు మీ కోసం..

  • మాస్క్‌ వేసుకోవడం తప్పనిసరి. అయితే.. దానిని ఎలాపడితే అలా చేతితో తాకడం, మాట్లాడే సమయంలో తీసేయడం.. ఒకే మాస్క్‌ ఎక్కువ రోజులు ధరించడం లాంటివి చేయకూదు. సర్జికల్‌ మాస్క్‌ 8 గంటల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు.
  • ఏసీలో గది తలుపులన్నీ వేసుకోవద్దు. దీనివల్ల ఎవరిలోనైనా వైరస్‌ ఉంటే మిగతా వారికి త్వరగా సోకుతుంది. ఏసీ వేసిన తలుపులు తెరిచి ఉంచడం మంచిది. కరెంటు ఖర్చయినా ఇబ్బంది లేదు.
  • ప్రస్తుతం ఏ లక్షణం ఉన్నా తనకు కొవిడ్‌ ఉండదనే నిర్లక్ష్యం సరికాదు. స్వల్ప జ్వరమొచ్చినా సరే కొవిడ్‌గానే అనుమానించి పరీక్షలు చేసుకోవాలి. కొందరిలో లక్షణాలు కన్పించిన 3-4 నాలుగు రోజులకే ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి.
  • పాజిటివ్‌ రాగానే చెస్టు సీటీ స్కాన్‌ చేయిస్తుంటారు. ఒక స్కాన్‌ 500 ఎక్స్రే​లతో సమానం. అనసరంగా సీటీ స్కాన్‌లు వద్దు. ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.
  • ఆర్టీపీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌ ఉండి ఆక్సిజన్‌ శాతం తగ్గుతూ ఏడు రోజులైనా జ్వరం తగ్గకుంటే.. అప్పుడు ఛాతి సీటీ స్కాన్‌ అవసరం అవుతుంది. ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌గా ఉన్నప్పటికీ జ్వరం తగ్గకుండా పెరుగుతూ వస్తున్నా.. ఆక్సిజన్‌ తగ్గుతున్నా సీటీ స్కాన్‌ అవసరం పడొచ్చు. ఎందుకంటే ఆర్టీపీసీఆర్‌లో పరీక్ష నమూనా స్రావాలను సరిగా తీయటం చాలా ముఖ్యం. లేదంటే వైరస్‌ ఉన్నాసరే నెగెటివ్‌ వస్తుంది.
  • కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో.. ప్రతి వ్యక్తిని పాజిటివ్‌గానే అనుమానించాలి. కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి. చేతులు కడుక్కోవటం, శానిటైజ్‌ చేసుకోవడం, టీకా తీసుకోవడం అత్యవసరం.
  • ఆక్సిజన్‌ స్థాయిలు సక్రమంగా ఉన్నప్పుడే స్టెరాయిడ్స్‌, రక్తం పలుచన చేసే మందులు వాడటం సరికాదు. అంతేకాక 85-90 శాతం మందికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అవసరమే ఉండదు. వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా మందులు వాడొద్దు.
  • ఇంట్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా మిగతా వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తిని పూర్తిగా ఐసోలేషన్‌ చేయాలి. మిగతా వ్యక్తులు మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు పాటించాలి.
  • యువతలో 30 శాతం మందికిపైగా వైరస్‌ బారిన పడుతున్నారు. చాలామంది వెంటిలేటర్ల వరకు వెళుతున్నారు. వైరస్‌లో వస్తున్న ఉత్పరివర్తనాలు ఈసారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి. దీంతో ఇంటి వద్దే ఉంటూ కోలుకోవచ్చు.
  • తక్కువ, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు ఇంట్లో పది రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. తర్వాత బయటకు రావొచ్చు. అయితే.. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న వారు వైద్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలి.
    Dr MV Rao,Physician
    -డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ ఫిజీషియన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.