ETV Bharat / state

మూడెకరాలు పంచి ఇస్తే.. కట్టుబట్టలతో బయటకు పంపారు!

author img

By

Published : Jan 3, 2023, 10:47 AM IST

బిడ్డలను అల్లారుముద్దుగా పెంచిన ఆ తల్లిదండ్రులకు.. వృద్ధాప్యంలో ఆలనాపాలనా కరవైంది. సంపాదించిందంతా కొడుకులకు కట్టబెడితే.. చివరకు బుక్కెడు బువ్వ పెట్టడం లేదు. కాటికి కాలు చాచిన కన్నతల్లి అనారోగ్యంతో మంచం పట్టినా పట్టించుకునే నాథుడు లేడు. దిక్కుతోచని స్థితిలో కుమారుల నుంచి కుటుంబ నిర్వహణ ఖర్చులు ఇప్పించాలని కోరుతూ ఆ వృద్ధ దంపతులు కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

old couple
old couple

ఈ వృద్ధుడి పేరు గుర్రాల మల్లయ్య. 86 ఏళ్లు ఉంటాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం. ముగ్గురు కుమారులు, ఒక కూతురు. అందరినీ పెంచి వివాహాలు చేశారు. కుమారులు తమకు నిలువ నీడ లేకుండా చేశారని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్య తాను సంపాదించిన మూడెకరాల భూమిని ఎకరం చొప్పున కొడుకులకు పంచారు. వారంతా వేర్వేరుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మల్లయ్య చిన్నపాటి గుడిసెలో భార్యతో కలిసి ఉండేవారు. ఆమెకు కళ్లు సరిగా కనిపించవు. అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో నిత్యం మల్లయ్యే సపర్యలు చేస్తుంటారు. వృద్ధాప్య పింఛనుపై ఆధారపడి జీవించేవారు.

ఇటీవల ముగ్గురు కొడుకులు.. ఆ చిన్న గుడిసెలో నుంచి కూడా బయటకు పంపించేశారు. దీంతో మల్లయ్య భార్యతో కలిసి ప్రస్తుతం కూతురు వద్ద ఉంటున్నారు. తమకు న్యాయం చేయాలని పలుసార్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌, ఆర్డీఓ కోర్టుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, అధికారులు పిలిచినప్పుడల్లా ఏదో కారణం చెప్పి వారు తప్పించుకునేవారు.. దీంతో మల్లయ్య సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో అర్జీ ఇచ్చారు. సంపాదించిందంతా కొడుకులకు కట్టబెడితే.. చివరకు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోవడంలేదని.. కుమారుల నుంచి కుటుంబ నిర్వహణ ఖర్చులు ఇప్పించాలని కోరుతూ తన గోడును పాలనాధికారికి చెప్పుకొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.