ETV Bharat / state

వనపర్తి వంతెన పనులు ఎప్పుడు పూర్తి..?

author img

By

Published : Jul 4, 2019, 9:58 AM IST

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరందించే డి-8 కాలువపై వేసవిలో సిమెంటు పనులు చేపట్టారు. ఇంతవరకు పూర్తి కాలేదు. ఇంకా పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కాలువలపై చేపట్టిన పనులు పూర్తికాకుండా నీటిని వదలడం కుదరదు. పనులను త్వరితగతిన పూర్తిచేస్తేనే కేఎల్‌ఐ ద్వారా సాగునీరు ఇవ్వడం సాధ్యమవుతుంది.

వనపర్తి వంతెన పనులు ఎప్పుడు పూర్తి..?

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ నాగర్‌కర్నూలు జిల్లా తూడుకుర్తి సమీపం నుంచి వెళుతుంది. తూడుకుర్తి శివారులోనే వనపర్తి జిల్లాకు నీటిని సరఫరా చేసే డి-8 కాలువ ప్రారంభమవుతుంది. అక్కడ ప్రారంభమైన ఆ కాలువ రేవల్లి, గోపాల్‌పేట, పాన్‌గల్‌, కోడేరు మండలాల మీదుగా 34 కి.మీ. దూరం వరకు సాగుతుంది. డి-8 ప్రధాన కాలువపై మొత్తం 6 చోట్ల పెద్ద వంతెనలు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికే నాలుగుచోట్ల పూర్తి చేశారు. ప్రస్తుతం గోపాల్‌పేట- చాకల్‌పల్లి దారిలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరో వంతెన 33వ కి.మీ. వద్ద నిర్మించాల్సి ఉంది. కాలువపై 3.99 కి.మీ. వద్ద లక్ష్మిదేవమ్మపల్లి సమీపంలో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 8.835 కి.మీ. వద్ద గోపాల్‌పేట- ఏదుట్ల దారిలో గతేడాదే నిర్మించారు. 17.19 కి.మీ. వద్ద జయన్నతిరుమలాపురం- రేమద్దుల మధ్య వంతెన నిర్మాణం పూర్తయింది. 20.83 కి.మీ. వద్ద పాన్‌గల్‌- రేమద్దుల దారిలో మరో వంతెన నిర్మాణాన్ని పూర్తిచేశారు.

మేజర్‌ కాలువలు ఏడు
డి-8 కాలువ నుంచి మొత్తం 7 మేజర్‌ కాలువలను తవ్వారు. అయితే పూర్తిస్థాయిలో వాటి పనులు జరగలేదు. కేశంపేట, గోపాల్‌పేట, ఏదుట్ల, జయన్నతిరుమలాపురం, పాన్‌గల్‌, రాజాపూరు, మాధవరావుపల్లి శివార్లలో మేజర్‌ కాలువలు ప్రారంభమవుతాయి. వాటికి తూములు, డ్రాపింగులు, లైనింగ్‌ పనులు చేయాల్సి ఉంది. డి-8 ప్రధాన కాలువకు నీరు చేరడంతో రైతులు వారి గ్రామాలకు రావాలని కోరడంతో అప్పట్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న మంత్రి నిరంజన్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని చెరువులు నింపేందుకు కాలువలను తవ్వించారు. అవే కాలువల ద్వారా రెండేళ్లుగా నీరు పారుతోంది.

17 మైనర్‌ కాలువలు
డి-8 ప్రధాన కాలువ నుంచి 34 కి.మీ. దూరం వరకు మొత్తం 17 చోట్ల మైనర్‌ కాలువలను నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం రెండుచోట్ల మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ వేసవిలో 5 చోట్ల మైనర్‌ కాలువల నిర్మాణాలు చేపట్టారు. కాలువ పొడవునా 55 చోట్ల డ్రాపింగులు నిర్మించాల్సి ఉండగా.. 20కిపైగా పూర్తయ్యాయి. ఇంకా పలుచోట్ల పనులు జరుగుతున్నాయి. కాలువల్లో పనులు జరుగుతున్నందున నీరు వదలడానికి వీలు కాదు. దీంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

నెలలో పూర్తి చేస్తాం
వేసవి కాలంలోనే కాలువలకు నీటి సరఫరా నిలిచిపోతుంది. పనులనూ వేసవి కాలంలోనే చేపట్టడానికి వీలవుతుంది. ప్రస్తుతం డి-8 కాలువపై చాకల్‌పల్లి శివారులో పెద్దవంతెన నిర్మాణం అవుతోంది. పలుచోట్ల డ్రాపింగులు, యూటీలు, మైనర్‌ కాలువల పనులు జరుగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరి కేఎల్‌ఐ పథకానికి వదిలేవరకు పనులు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా చేపట్టిన అన్ని సిమెంటు పనులను నెల రోజుల్లో పూర్తి చేయిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : "మా గోడు పట్టించుకునే నాథుడే లేడు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.