ETV Bharat / state

సూర్యాపేటలో ముమ్మరంగా శోధిస్తున్న ప్రత్యేక బృందాలు

author img

By

Published : Apr 20, 2020, 6:39 AM IST

సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్‌, ఔషధ దుకాణం ప్రాంతంలో వైరస్‌ ఎలా విస్తరించిందన్న దానిపై వివిధ కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఔషధ దుకాణంలో పనిచేసే వ్యక్తి నుంచి అక్కడికి వచ్చిన మహిళ ద్వారా కరోనా సోకిన నేపథ్యంలో అక్కడ ఇంకా ఎవరు ఔషధాలు కొనుగోలు చేశారనే దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు.

Special teams searching in the suryapet
సూర్యాపేటలో ముమ్మరంగా శోధిస్తున్న ప్రత్యేక బృందాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఔషధ దుకాణంలో పనిచేసే వ్యక్తి నుంచి అక్కడికి వచ్చిన మహిళ ద్వారా కరోనా సోకిన నేపథ్యంలో.. అక్కడ ఇంకా ఎవరు ఔషధాలు కొనుగోలు చేశారనే దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఔషధ దుకాణం ప్రైవేటు వైద్యశాలలు విస్తరించిన ప్రాంతంలో ఉంది. ఇక్కడికి రోజుకు సగటున వందలాది మంది మందుల కోసం వస్తుంటారు. మార్చి 30, 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో దుకాణానికి ఎందరు వచ్చారనే వివరాలను మొబైల్‌ నంబర్ల ఆధారంగా అధికారులు సేకరించారు. వారికి నేరుగా ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. అంతటితో వదిలేయకుండా అనుమానితులు మందులు కొన్న తేదీ నుంచి కరోనా లక్షణాలు బయటపడే వరకు ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

* నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలో 40 మందికి వైరస్‌ వ్యాపించింది. వీరికి సంబంధించి కేవలం ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులనే కాకుండా సెకండ్‌, థర్డ్‌, ఫోర్త్‌ ఇలా ఆరు దశల వరకు వ్యక్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు కంటైన్‌మెంట్‌ జోన్లలోనే అనుమానితుల వివరాలు తెలుసుకునేవారు. తాజాగా మార్కెట్‌ యార్డుతో సంబంధాలు నెరిపే 4 మండలాల్లోని 40కి పైగా గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. వైరస్‌ మహమ్మారిపై అనుమానం ఉంటే సమీపంలోని వైద్య సిబ్బందికి లేదా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు.

* అనుమానితులను గుర్తించేందుకు పోలీసు బృందాలు సాంకేతిక పద్ధతులు అవలంభిస్తున్నాయి. కాల్‌డేటాను ఆధారం చేసుకుని శోధిస్తున్నాయి. పాజిటివ్‌ వ్యక్తులు గత 14 రోజుల నుంచి ఎవరెవరితో మాట్లాడారు.. వారి మొబైల్‌ నంబర్ల సమీపంలో ఏయే నంబర్లు ఉన్నాయో సేకరిస్తున్నాయి. వైరస్‌ సోకిన వారిని కలిసినట్లు రూఢీ అయితే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అనుమానితులను గుర్తించే.. క్లిష్టమైన కేసులను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు వినియోగించే పద్ధతులు అవలంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి: ఆంక్షలు ఫలించిన వేళ.. సడలింపులకు సమాయత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.