ETV Bharat / state

దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

author img

By

Published : Oct 27, 2020, 5:24 AM IST

Updated : Oct 27, 2020, 7:09 AM IST

దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో జరిగిన సోదాలతో సిద్దిపేట రణరంగంగా మారింది. ఆందోళనలు, నిరసనలతో అట్టుడికింది. రఘునందన్‌రావును పరామర్శించడానికి వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడం... మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌... తనపై దాడి చేశారన్న సంజయ్‌... ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్‌లో దీక్షకు దిగారు. సీపీని సస్పెండ్‌ చేసే వరకూ దీక్ష విరమించబోనని స్పష్టంచేశారు.

దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట
దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

సిద్దిపేటలో అధికారుల తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన రఘునందన్‌రావు... మామ రాంగోపాల్‌రావు, మరో వ్యక్తి అంజన్‌రావు ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు... రూ. 18 లక్షల 67 వేలు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు, పార్టీ శ్రేణులు అంజన్‌రావు ఇంటికి చేరుకున్నారు. ఆందోళనలు, నిరసనలతో పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. ఈక్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రఘునందన్‌రావు కిందపడగా ఆయన చేతికి గాయమైంది.

ఆ సొమ్ము నాది కాదు...

తనిఖీల్లో అంజన్‌రావు ఇంట్లో దొరికాయని చెబుతున్న రూ. 18.67 లక్షలతో తనకు ఎలాంటి సంబంధం లేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. నగదులో కొంత మొత్తాన్ని భాజపా కార్యకర్తలు లాక్కెళ్లారని పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనను ఎన్నికల నుంచి తప్పించేందుకు తెరాస కుట్ర చేస్తోందన్నారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం..

ఉద్రిక్తతల గురించి తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి... సిద్దిపేటకు వచ్చారు. రఘునందన్‌రావును పరామర్శించిన ఆయన భాజపా ప్రచారాన్ని అడ్డుకునేందుకు తెరాస ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

దీక్షకు దిగిన బండి సంజయ్​..

రఘునందన్‌రావుకు మద్దతుగా భాజపా శ్రేణులు సహా ముఖ్య నేతలు రాకతో సిద్దిపేట అట్టుడికింది. కార్యకర్తలకు మద్దతు పలికేందుకు వస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం... ఉద్రిక్తతను మరింత పెంచింది. సిద్దిపేట శివారుల్లోనే సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఆయన్ని కరీంనగర్‌కు తరలించారు. తనను అరెస్ట్‌ చేసే క్రమంలో సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌... చేయి చేసుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. పార్లమెంట్​ సభ్యుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడినని చూడకుండా అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. జోయల్‌ డేవిస్‌పై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్‌లోని తన కార్యాలయంలో దీక్ష ప్రారంభించారు. స్వీయనిర్బంధం విధించుకున్న బండి సంజయ్‌... సీపీని సస్పెండ్‌ చేసే వరకూ దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు.

అప్రజాస్వామికం..

సంజయ్‌పై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమని ఓటమి భయంతోనే తెరాస కుట్రలకు పాల్పడుతోందని భాజపా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వివేక్‌ ఆరోపించారు. దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పరామర్శించారు. కరీంనగర్‌లోని సంజయ్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: అంజన్​ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం: సిద్దిపేట సీపీ

Last Updated : Oct 27, 2020, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.